రబీ సాగు విస్తీర్ణం పెంచాలి

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి
శ్రీకాకుళం, ఆగస్టు 3 : జిల్లాలో 2012-13లో రబీ సాగు విస్తీర్ణం పెంచేవిధంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ విస్తరణ విభాగం సంయుక్త సంచాలకులు డాక్టర్‌ పి.పున్నారావు పేర్కొన్నారు. ఆమదాలవలస పట్టణంలోని జిల్లా వ్యవసాయ సలహా, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ కేంద్రం (ఏరువాక)లో నిర్వహించిన 26వ జిల్లాస్థాయి సమవ్వయకమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత మూడేళ్లుగా రబీ సాగు తగ్గుముఖం పట్టడం చాలా ఆశ్చర్యంగా ఉందని, రైతులు రబీ సాగు విస్తీర్ణంలో వరి, అపరాల సాగుతో పాటు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా పంటలను ఆశిస్తున్న తెగుళ్లు, పురుగులు, వాటి నివారణ చర్యలపై రూపొందించిన పుస్తకాన్నిఇ విడుదల చేశారు. అనంతరం 2011 లో రబీసాగు విస్తీర్ణం, సమస్యలు, ప్రదర్శన క్షేత్రాలు, విస్తరణ కార్యక్రమాపై ఏరువాక కేంద్రం ప్రోగ్రాం సమన్వయకర్త డి.చిన్నంనాయుడు పవర్‌ పాయంట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో అనకాపల్లి ప్రాంతీయ పరిశోధనా స్థానం అసోసియేట్‌ డైరెక్టర్‌ డా. ఆర్‌.అంకయ్య, నైరా వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డా. ఎం.వెంకునాయుడు, నాబార్డు ఏజీఎం సుబ్రహ్మణ్యం, రైతు శిక్షణ కేంద్రం ఏడీఏ భవానీ శంకర్‌, ఏరువాక, కృషివిజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం సమన్వయకర్తలు డి.చిన్నంనాయుడు, డా. ఎస్‌.నీలవేణి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, సలహా సంఘం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.