రాయలసీమ గూండాగిరి తెలంగాణలో సాగనివ్వం

¬

 

శ్రీఇదే తీరు కొనసాగిస్తే మట్టికరిపిస్తాం

ఈటెల హెచ్చరిక

హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) :

రాయలసీమ గుండాగిరీని తెలంగాణలో సాగనివ్వబోమని, ఇకపై ఇదే తీరు కొనసాగిస్తే వైకాపాను మట్టి కరిపిస్తామని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ హెచ్చరించారు. వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ కార్యాలయంపై వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు దాడిని ఆయన ఖండించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయంపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, తగిన చర్యలు తీసుకోవాలని.. లేకుంటే, మేమే ఆ పని చేస్తామని హెచ్చరించారు. తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి తెలంగాణ ఉద్యమంపై జరిగిన దాడేనని వ్యాఖ్యానించారు. మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే ఖబర్దార్‌ అని హెచ్చరించారు. దాడులకు ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. వరంగల్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంపై దాడి ఘటనను టిఆర్‌ఎస్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన అత్యంత హేయమైనది, గూండాగిరితో కూడుకున్నదని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే నివేదిక తెప్పించుకొని విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే తామే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అలాకని పక్షంలో ఏం చేయాలో చూసుకుంటామని అన్నారు. తమ పార్టీ కార్యాలయంపై వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ దుండగులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. పోలీసులు యాక్షన్‌ తీసుకోకుంటే తామే యాక్షన్‌ తీసుకుంటామన్నారు. మహబూబాబాద్‌ తరహాలో సమాధానం మిస్తామన్నారు. ఇక్కడ రాయలసీమ సంస్కృతిని ప్రవేశ పెట్టాలని కొండా దంపతులు చూస్తున్నారని ఈటెల ఆరోపించారు. దీనిని తాము ఆషామాషీగా తీసుకోమని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ఘటనలతో తెలంగౄణకు అడ్డుపడాలన్న ద్రోహబుద్ది ఉందన్నారు. ఇదిలావుంటే కెసిఆర్‌పై చేసిన వ్యాషఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖ మంగళవారం వరంగల్లో అన్నారు. కెసిఆర్‌ పైన తాను చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకునేది లేదని చెప్పారు. తన ఇంటి పైకి టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు వచ్చి దాడి చేసి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తే తప్పు లేదా అని ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తనకు అండగా ఉండేందుకు తన పట్ల కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు వెళ్లారన్నారు. తెరాస వాళ్లే తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు. వారు రెచ్చగొట్టి రౌడీయిజం చేసి మమ్మల్ని అంటే ఎలా అన్నారు. మా ఇంటిపై దాడి చేసి దిష్టి బొమ్మ తగులబెట్టినప్పుడు లేని తప్పు విూ కార్యాలయానికి వచ్చి కెసిఆర్‌ దిష్టి బొమ్మ తగులబెడితే తప్పేంటన్నారు. రౌడీయిజాన్ని ఎవరు ప్రారంభించారో తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. తెలంగాణ ఇస్తాం.. తెస్తాం.. అంటూ కెసిఆర్‌ పన్నెండేళ్లుగా ప్రజలను మభ్య పెడుతున్నారని, మోసం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. తమను విమర్శించే నైతిక హక్కు కెసిఆర్‌కు లేదన్నారు. పరకాల ఎన్నికల సమయంలో మూడు నెలల్లో తెలంగాణ తీసుకు వస్తుందని ప్రకటించిన కెసిఆర్‌ ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు.