రీపోలింగ్‌ ఉండదు

శ్రీస్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతం
శ్రీనాలుగు చోట్ల పోలింగ్‌ బహిష్కరణ : భన్వర్‌లాల్‌
హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి):
రెండు మూడు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ చెప్పారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉప ఎన్నికలకు సంబం ధించిన అంశాలను తెలియజేశారు. 80 శాతం పైగా పోలింగ్‌ నమోదైందని అన్నారు.  ఓటర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఎక్కడా కూడా రీ-పోలింగ్‌కు అవకాశం లేదన్నారు. ఓటర్లు పలు ప్రాంతాల్లో క్యూల్లో బారులు తీరి ఉండడంతో నిర్ణీత సమయం ముగిసినప్పటికి ఆయా ప్రాంతాల్లో పోలింగ్‌ సమయాన్ని 7.30 గంటల వరకు పొడిగించామన్నారు. కడప జిల్లా రైల్వేకోడూరు లో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయని, అయినప్పటికి పోలింగ్‌ను సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. పోలవరం నియోజకవర్గంలోని 61, 62 పోలింగ్‌ బూత్‌లలో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి లేకపోవడంతో పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు చెప్పారన్నారు. అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలోని కోవూరు, కావలి సెగ్మెంట్లలోని రెండు ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారన్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే తాము పోలింగ్‌ను బహిష్కరిస్తున్నామని వారు వివరించారన్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు. ఓటర్ల లిస్టులో పేర్లు గల్లంతు అయినట్టుగా అక్కడక్కడ నిరసన చోటుచేసుకుందని, ఓటర్ల లిస్టులో పేర్లను సరి చూసుకోవాలని తాము చెబుతూనే ఉన్నామన్నారు. 7.30 గంటలకు పోలింగ్‌ ముగిసిన తర్వాత మరిన్ని వివరాలను అందజేస్తామన్నారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సహాకారం వల్ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు.