రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ
హుస్నాబాద్ : కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్, జూనియర్ లైన్‌మన్ సంపత్ రైతు వద్ద రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కెపాసిటీ సరిపోక అదనపు కెపాసిటీ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు అదనంగా రెండు ఫీడర్లు ఏర్పాటు చేయాలని రైతులు ట్రాన్స్‌కో ఎస్‌ఈకి దరఖాస్తు చేసుకున్నారు. రైతుల దరఖాస్తును పరిశీలించిన ఎస్‌ఈ 15 రోజుల క్రితమే ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేశారు. దానిని బిగించకుండా ఏఈ, జేఎల్‌ఎం రైతులను నిత్యం ఆఫీసు చుట్టూ తిప్పడం మొదలు పెట్టారు. రూ.15 వేలు లంచం ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తామని వారు తెగేసి చెప్పడంతో రైతులు ఏసీబీని ఆశ్రయించారు. శుక్రవారం బాదావత్ గంగ్యా అనే రైతు వద్ద వారు రూ.15 వేలు తీసుకుంటూ పట్టుకున్నారు.