రూ. 4 లక్షల ఎర్రచందనం స్వాధీనం

నెల్లూరు, జూలై 10 : గూడూరు మండలం వెంకటగిరి క్రాస్‌రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 4లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగలను మంగళవారం ఫారెస్ట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తడ, సూళ్లూరుపేట, చెక్‌పోస్టుల వద్ద నిఘా పెరగడంతో వెంకటగిరి, పాలాయపల్లి, డక్కిలి ప్రాంతాల నుంచి ఎర్రచందనం అడ్డదారుల్లో తరలిస్తున్నారు. గూడూరు మీదుగా ముత్తుకూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు మీదుగా కడప జిల్లాలోకి ఎర్రచందనం రవాణా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారు జామున డక్కిలి ఆటవీ ప్రాంతం గుండ ఎర్రచందనం తరలిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తుల ఆటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీనితో గూడూరు క్రాస్‌రోడ్డు వద్ద ఆటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు పారిపోయినట్లు తెలుస్తోంది.