రెండో వన్డేలో ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికా విజయం
వన్డేల్లోనూ అగ్రస్థానం కైవసం చేసుకున్న సఫారీలు
సౌతాంప్టన్ ,ఆగష్ట్ 29 (ఆర్‌ఎన్‌ఎ): ఇంగ్లాండ్‌పై టెస్ట్ సిరీస్ గెలిచి అగ్రస్థానం చేజిక్కుంచుకున్న సఫారీ టీమ్ వారిని మరో దెబ్బ కొట్టింది. వన్డేల్లోనూ వారి టాప్ ప్లేస్‌కు ఎసరు పెట్టింది. సౌతాంప్టన్‌లో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 80 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. తద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. దీంతో మూడు ఫార్మేట్లలోనూ దక్షిణాఫ్రికా జట్టు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు ఓపెనర్లు స్మిత్ , ఆమ్లా మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. స్మిత్ హాఫ్ సెంచరీ చేసి ఔటైనా…ఆమ్లా చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌తో చక్కని భాగస్వామ్యాలు నెలకొల్పడంతో సౌతాఫ్రికా స్కోర్ 250 పరుగులు దాటింది. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో ఆమ్లాకు ఇది పదో సెంచరీ. శతకం తర్వాత మరింత దూకుడుగా ఆడిన ఆమ్లా 27 బంతుల్లోనే మరో 50 పరుగులు సాధించాడు. ఆమ్లా 150 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఔటయ్యాడు. దీంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్లకు 287 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కుక్ డకౌటయ్యాడు. అయితే ట్రాట్ , బెల్ నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ఈ దశలో మోర్కెల్ ట్రాట్‌ను ఔట్ చేసి వీరి పార్టనర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. అటు పీటర్సన్ కూడా బెల్ , బొపారాలను పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లాండ్ వికెట్ల పతనం మొదలైంది. మిగిలిన బౌలర్లు కూడా వారికి సహకారమందించడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. సమ్మిత్ పటేల్ ధాటిగా ఆడి 45 పరుగులు చేసినప్పటకీ… ఫలితం లేకపోయింది. చివరకి ఇంగ్లాండ్ 40.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బౌలర్లలో పీటర్సన్ , మోర్కెల్ , పార్నెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకుంది. అటు ఇంగ్లాండ్ మూడో స్థానానికి పడిపోయింది. ఐదు వన్డేలో సిరీస్‌లో మూడో మ్యాచ్ ఆగష్ట్ 31న ఓవల్‌లో జరుగుతుంది.
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ ః
1. దక్షిణాఫ్రికా – 124 పాయింట్లు
2. భారత్ – 120 పాయింట్లు
3. ఇంగ్లాండ్ – 118 పాయింట్లు
4. ఆస్టేల్రియా – 114 పాయింట్లు
5. శ్రీలంక – 108 పాయింట్లు
6. పాకిస్థాన్ – 103 పాయింట్లు
7. వెస్టిండీస్ – 94 పాయింట్లు
8. న్యూజిలాండ్ – 74 పాయింట్లు
9. బంగ్లాదేశ్ – 71 పాయింట్లు
10. జింబాబ్వే – 50 పాయింట్లు