రైతులకు సంఘీభావం
– ఒక పూట పస్తులతో జనం
– దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు విజయవంతం
దిల్లీ,డిసెంబరు 21 (జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో హస్తిన శివారుల్లో అన్నదాతల ఉద్యమం 26వ రోజు కొనసాగుతోంది. దిల్లీలో నానాటికీ చలి తీవ్రత పెరుగుతున్నా రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎముకలు కొరికే చలిలోనూ రహదారులపై బైఠాయించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా సోమవారం రైతులు 24 గంటల రిలే నిరాహారదీక్షకు దిగారు. నేటి నుంచి ఈ దీక్షలు కొనసాగుతాయని, రోజూ 11 మంది రైతులు నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బీకేయూ పంజాబ్ సెక్రటరీ బల్వంత్ సింగ్ తెలిపారు. అంతేగాక, ఈ నెల 25 నుంచి 27 వరకు హరియాణా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలును అడ్డుకోనున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి. బుధవారం రైతు దినోత్సవాన్ని పాటించనున్నట్లు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం మరోసారి ప్రయత్నాలు జరిపింది. చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ ఆదివారం లేఖ రాశారు. తమకు అనుకూలమైన తేదీని రైతులే నిర్ణయించాలని లేఖలో కోరారు. దీనిపై రైతు సంఘాలు నేడు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నాయి. మరోవైపు రైతుల ఆందోళన దృష్ట్యా దిల్లీ సరిహద్దుల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. టిక్రి, సింఘు సరిహద్దులు పూర్తిగా స్తంభించాయి. చిల్లా సరిహద్దుల్లో ఒకవైపు మాత్రమే రాకపోకలు కొనసాగుతున్నాయి. 44వ నంబరు జాతీయ రహదారిపైకి వాహనాలను అనుమతించట్లేదు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని దిల్లీ పోలీసులు సూచిస్తున్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హరియాణా రైతులు గడిచిన 25 రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఉత్తరాదిన తీవ్ర చలి వణికిస్తున్నా పట్టుసడలకుండా వారు చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా ఎంతో మంది ప్రముఖులు రైతు సంఘాల ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. రైతులకు తోడుగా నిలుస్తున్నారు.
ఎంఎస్పీ రద్దు చేస్తే రాజకీయాలు వదిలేస్తా
రైతుల ప్రయోజనాల కోసమే కేంద్రం కొత్త చట్టాలు తీసుకొచ్చిందని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. ఈ చట్టాల వల్ల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు ఎలాంటి ముప్పు ఉండబోదని మరోసారి స్పష్టం చేశారు. నూతన చట్టాల అమలు తర్వాత ఒకవేళ కనీస మద్దతు ధర రద్దయితే గనుక తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని ఖట్టర్ చెప్పారు.