రైతుల ఆందోళనతో.. చలికే వణుకు

 

– దేశవ్యాప్తంగా కాకా పుట్టిస్తున్న రైతు ఉద్యమం

– అలుపెరగని పోరు

– సర్కారు చర్చించాలా.. వద్దా..

– నేడు నిర్ణయం..

దిల్లీ,డిసెంబరు 22 (జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 27వ రోజుకి చేరింది. ఓవైపు నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నా.. వణికిస్తున్న చలిని సైతం లెక్కచేయకుండా రైతన్నలు వారి నిరసనను కొనసాగిస్తున్నారు. నిన్న ప్రారంభించిన రైతుల సంఘాల నేతల రిలే నిరాహారదీక్షలు కూడా కొనసాగుతున్నాయి. సింఘు, టిక్రీ, ఘాజిపూర్‌ సరిహద్దుల వద్ద భైఠాయించిన రైతులు ఇంకా నిరసన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై నేడు రైతు సంఘాలు మరోసారి భేటీ కానున్నాయి. చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం తాజాగా పంపిన ప్రతిపాదనలపైన ఈ భేటీలో చర్చించనున్నారు. ఆందోళనలో భాగంగా నేడు మరోసారి దిల్లీ-మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను దిగ్బంధించారు. దీంతో అటు యూపీతో పాటు దిల్లీ పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూపీ నుంచి వస్తున్న రైతుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారని.. అందుకే మరోసారి రోడ్డును స్తంభింపజేయాల్సి వస్తోందని రైతు నేతలు తెలిపారు. సోమవారమే ఈ మేరకు మార్గాన్ని మూసివేయగా.. పోలీసులతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గంట తర్వాత రైతులు అక్కడి నుంచి తప్పుకున్నారు.ఉష్ణోగ్రతలు భారీ ఎత్తున పడిపోయిన నేపథ్యంలో సింఘులో ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో ఉంచుకొని వీటిని అందుబాటులోకి తెచ్చారు. ఇక అధిక శాతం మంది రైతులు తాము వచ్చిన ట్రాక్టర్‌, లారీ ట్రాలీల్లోనే నిద్రిస్తున్నారు. మరోవైపు పంజాబ్‌లో అడ్తియాలుగా పిలిచే కమిషన్‌ ఏజెంట్లు రైతుల దీక్షలకు సంఘీభావంగా నేటి నుంచి నాలుగు రోజులు పాటు తమ దుకాణాలను మూసివేయనున్నారు. ఇక చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖపై రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. లేఖలో కొత్త ప్రతిపాదనలేవి లేవని తెలిపాయి. సరైన పరిష్కార మార్గంతో సిద్ధమని స్పష్టం చేశాయి. ఇప్పటికే డిసెంబర్‌ 23న కిసాన్‌ దివస్‌ పేరిట రైతులకు మద్దతుగా ప్రజలు ఒక్కపూట ఉపవాసం ఉండాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 25 నుంచి 27 వరకు హరియాణాలో టోల్‌ బూత్‌ రుసుముల చెల్లింపు నిరాకరించాలని నిర్ణయించారు. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.

బ్రిటన్‌ ఎంపీలకు లేఖలు రాస్తాం: రైతు సంఘాలు

దిల్లీ: రైతుల్ని చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖపై బుధవారం నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు రైతు సంఘాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి.’చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖపై వెళ్లాలా వద్దా అనే అంశంపై బుధవారం నిర్ణయం తీసుకుంటాం. కేంద్రం రాసిన లేఖలో కొత్త అంశాలేవీ లేవు. ఇకముందు ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించాం. జనవరి 26న భారత్‌కు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వస్తున్న నేపథ్యంలో.. ఆయనను రావద్దని బ్రిటన్‌ ఎంపీలకు లేఖలు రాయాలని నిర్ణయించాం. రైతుల డిమాండ్లను కేంద్రం ఒప్పుకునే వరకు భారత్‌ పర్యటనకు రావొద్దని లేఖ పంపుతాం’ అని రైతు సంఘాలనేతలు హెచ్చరించారు. ‘కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరు ఆగదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు దిల్లీకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. కేంద్రం తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి చట్టాలను వెనక్కి తీసుకోవాలి’ అని రైతు సంఘాలు డిమాండు చేశాయి. కాగా కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు 26 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.