రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమిద్దాం..

మిర్యాలగూడ. జనం సాక్షి.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక అసంబద్ధ విధానాలను తిప్పి కొట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఉద్యమాలను ఉదృతం చేయాలని రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. రైతుల డిమాండ్స్ డే సందర్భంగా గురువారం యాద్గార్ పల్లి గ్రామంలో జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. రైతుల ఉద్యమాల ఫలితంగానే కేంద్ర సర్కారు దిగివచ్చి నల్ల చట్టాలను వెనక్కు తీసుకుందన్నారు. బావుల వద్ద మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియకు శ్రీకారం చుడుతుందని ఈ విధానాన్ని రైతులు ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు. ప్రధానమంత్రి మోదీ నల్ల చట్టాలను తాత్కాలికంగా వెనక్కి తీసుకున్న ఆ చట్టాలను అమలుపరిచేందుకే పూనుకుంటున్నారన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర. పెట్టిన పెట్టుబడులు వెళ్లక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వాలకు చీమకుట్టినట్లైనా లేదని వాపోయారు. నేటికీ 80 శాతం మంది వ్యవసాయ రంగాన్నే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని వారి పరిస్థితి నేడు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ పూర్తిస్థాయిలో అమలు జరిపినప్పుడే రైతులకు మేలు చేకూరుతుందన్నారు క్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బిల్లా కనకయ్య. మండల సహాయ కార్యదర్శి గువ్వల వెంకటయ్య. దేవరకొండ రాములు. చంద్రమౌళి. నవీన్. అన్నపూర్ణ. నరసింహ. నర్మదా. కోటేష్. జయలక్ష్మి. వినయ్. సైదమ్మ. సుజాత పాల్గొన్నారు