లోక్‌పాల్‌కు మద్దతివ్వండి కిరణ్‌బేడీ

హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి): లోక్‌పాల్‌ బిల్లుకు మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టనున్నట్టు సామాజిక కార్యకర్త అన్నా హజారే బృందం సభ్యురాలు కిరణ్‌బేడీ అన్నారు. బుధవారంనాడు అన్నాహజారే బృందం నగరానికి చేరుకుంది. కిరణ్‌బేడీ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జులై 25న లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టనున్న ఆమరణదీక్షకు మద్దతు కోసం, దేశవ్యాప్త ప్రచారం కోసం విచ్చేశామన్నారు. రాష్ట్రంలో తాజా ఉపపోరులో ధనం ఏరులై పారినట్టుగా, అవినీతి రాజ్యమేలినట్టుగా వెల్లువెత్తిన ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయన్నారు. బెయిల్‌ కోసం కోట్లాది రూపాయల మేర అవినీతికి పాల్పడడం దారుణమన్నారు. ఇలాంటి వాటిని వెలికి తీసేందుకు పటిష్టమైన న్యాయవ్యవస్థ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక కుంభకోణంపై దర్యాప్తు ఒక దశకు చేరకముందే మరో కుంభకోణం వెలుగు చూస్తోందన్నారు. అవినీతి కేసులను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అప్పుడే ప్రజా సొమ్ముకు భద్రత ఏర్పడుతుందన్నారు. రాష్ట్రం అవినీతిమయంగా మారడం విచారకరమన్నారు. అందుకే పటిష్టమైన జనలోక్‌పాల్‌ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు.