లోపభూయిష్ట భద్రతచర్యలతోనే శివకాశిలో మృత్యు మంటలు

రాత్రి ఆకాశమంతా వెలుగులు చిమ్మే దీపావళి శివకాశివాసుల బతుకుల్లో మూడు నెలల ముందే పట్టపగలు మృత్యు మంటలను రగిల్చింది. మినీ జపాన్‌గా పిలువబడే శివకాశిలో బీభత్స వాతావరణాన్ని తలపిస్తూ మరో పెను విషాదం సంభవించింది. బుధవారం ఈ ఘటనకు విరుదునగర్‌ జిల్లా శివకాశి శివారులోని మొదలిపట్టిలోని ఓంశక్తి ఫైర్‌ వర్క్స్‌ ఫ్యాక్టరీ వేదికైంది. దాదాపు 39 మందిని మృత్యువు కబళించగా, మరో 50 మందికి పైగా మృత్యు ముఖం నుంచి బయటపడేందుకు కొన ఊపిరితో కొట్లాడుతున్నారు. దక్షిణ తమిళనాడులో ఉండే శివకాశి దాని చుట్టుపక్కల గ్రామాలు పటాకుల తయారీ కేంద్రాలకు నిలయాలు. దీపావళికి దేశమంతటా ఆనందరతో కాల్చుకునే బాణసంచాలు 90 శాతం ఇక్కడే తయారవుతాయి. అలాగే అగ్గి పుల్లలు కూడా 80 శాతం ఇక్కడే తయారవుతాయి. ఇక్కడ నెలకొన్న 600 ఫ్యాక్టరీల్లో దాదాపు 50 వేల మంది కార్మికులు పని చేస్తుంటారు. వీరిలో బాల కార్మికులే అధికంగా ఉండడం శోచనీయం. నీటి పారుదల సక్రమంగా లేనందువల్ల శివకాశి వ్యవసాయానికి యోగ్యం కాని భూమి. దీంతో ఈ ప్రాంతం పరిశ్రమలకు నిలయంగా మారింది. అయితే, ఇక్కడ పని చేసే కార్మికులకు సరైన రక్షణ చర్యలు లేనే లేవు. నిత్యం ప్రమాదాలు వీరిని వెన్నంటే పొంచి ఉంటాయి. ఎప్పుడేం జరుగుతుందో.. ఎలా ప్రమాదం ముంచెత్తుతుందో తెలియని పరిస్థితి. ఇంతటి విషాదానికి కారణమైన ఈ ఫ్యాక్టరీ లైసెన్స్‌ ఒక రోజు ముందే రద్దయింది. యాజమాన్యాలు అధికారులకు లంచాలకు అలవాటు చేయడంతో ముందే ఇలాంటి ఫ్యాక్టరీలను మూసివేయించే పరిస్థితి లేనేలేదు. పెట్రోలియం చట్టాల ప్రకారం చాలా పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు అదుపులోకి తెచ్చే పరికరాలనేవి కనుచూపు మేరలో కనిపించవు. దీనికి తోడు దీపావళి సమీపిస్తుండడంతో నాలుగు రాళ్లు వెనుకేసుకునేందుకు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చే కుటీర పరిశ్రమలు ఇక్కడే అధికం. జాతీయ పరిశ్రమల చట్టం 1948, తమిళనాడు ఫైర్‌ సర్వీస్‌ యాక్ట్‌ 1985 ప్రకారం రక్షణ అధికారులు, ఫైర్‌ సర్వీస్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి కార్మికుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీరు యజమానులతో కుమ్మక్కై ప్రమాదకరమైన ఈ పరిశ్రమల్లో రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో పరిశీలించేందుకు ముందుకు రాకపోవడంతో ఇంతటి పెను విషాద సంఘటన జరగడానికి కారణమైంది. అలాగే ఈ ప్రమాదం సంభవించినప్పుడు మొదట విస్ఫోటనం జరిగిన వెంటనే మేల్కొని సహాయ చర్యలు తీసుకుని ఉంటే  ఆ తరువాత వెనువెనువెంటనే జరిగిన వరుస విస్ఫోటనాల నుంచి కొంతమందినైనా రక్షించే అవకాశం ఉండేది. చుట్టుపక్కల వారే ప్రాణాలు కాపాడటానికి పరుగులు తీశారు గానీ, అగ్నిమాపక సిబ్బంది పత్తాలేరు. తయారు చేసిన బాణసంచా నిల్వలపై నిప్పురవ్వలు ఎగసిపడే సమయంలో అధికారులు రక్షణ సహాయక చర్యలు తీసుకున్నట్లయితే విస్ఫోటనాల ఉధృతి తగ్గేది. ప్రాణాలు గాలిలో కలిసేవి కావు. ఈ ప్రమాదంతో ఎగసిపడిన పొగ వల్లే ఊపిరాడక 20 మంది కార్మికులు కదలలేక, మంటలకు ఆహుతయ్యారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. పన్నెండేళ్లలో శివకాశిలో జరిగిన ప్రమాదాల్లో 237 మంది చనిపోయారు. మరో 200 మంది గాయపడ్డారు. నలుగురి కన్నా ఎక్కువ మంది పట్టని విధంగా చిన్న చిన్న గదుల్లో చిన్నారుల చేత వెట్టి చాకిరి చేయించడం ఇక్కడి యాజమాన్యాల ధనదాహానికి సాక్ష్యం. కనీసం ప్రమాదం సంభవించినప్పుడు గదులకు సరైన తలుపులు కూడా లేనందున కార్మికులు బయట పడే పరిస్థితి లేకుండా పోయింది. బాణసంచా తయారీలో ఉపయోగించే ముడి సరుకుల ధర రానురాను ఆకాశన్నంటుతుండడంతో చాలా కర్మాగారాలు నామమాత్రపు కూలి ఇచ్చి పిల్లలతో పని చేయించడాన్ని నీడ్స్‌ అనే ప్రభుత్వేతర సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది. ఈ సంస్థ రెండేళ్లుగా చేస్తున్న పోరాటాల వల్ల యాజమాన్యాలు బాలకార్మికులతో పనిచేయించడం తగ్గించిందని అందరూ భావిస్తుండగా, కొత్త కొత్త రూపాల్లో వారిచేత చాటుగా అదే పని చేయిస్తున్నారన్న విషయం ఎవరికీ తెలియదు. పటాకుల్ని ఎండబెట్టే పనిని మాత్రమే పిల్లలకు అప్పజెప్పుతున్నామని యాజమాన్యం బుకాయిస్తోంది. ఈ విధంగా ప్రైవేటు యాజమాన్యాలు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా, ఇక్కడి ప్రభుత్వం బాధ్యతారహితంగా చేతులు కట్టుకుని కూర్చుంటోంది. చాలా ఫ్యాక్టరీలకు కావాల్సిన అనుమతులు లేవు. ప్రమాదాలు నివారించే, అప్రమత్తం చేసే చర్యలు శూన్యం.  ఫ్యాక్టరీ, కార్మిక, కాలుష్య, నియంత్రణ, అగ్నిమాపక తదితర ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అగ్నిమాపక శాఖ అధికారి ఒక్కరే ఉండడం వల్ల ఇన్ని వందల ఫ్యాక్టరీల్లో రక్షణ చర్యలు ఏం తీసుకుంటున్నారనేది తనిఖీ లేకుండా పోయింది. అలాగే ఒకే ఒక జనరల్‌ ఆస్పత్రిని శివకాశిలో ఏర్పాటు చేశారు. అందులో కూడా కాలిన గాయాలకు చికిత్స చేసే వార్డు ఒకటే ఉంది. అదే విధంగా రెండే ఫైర్‌ ఇంజన్లు ఉన్నాయి. ఇవి సకాలంలో చేరుకోవడానికి సరైన రోడ్లు కూడా లేవు. అందువల్లే బుధవారం ఫైరింజన్లు సకాలంలో చేరుకోలేక వరుస విస్ఫోటనాలు సంభవించాయి. ఇలాంటి ప్రమాదకర ప్రదేశాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రమాదాలను సాధ్యమైనంత వరకు నివారించవచ్చు. అసంఘటిత, సంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికుల ప్రాణాలన్నా, సంక్షేమమన్నా ప్రభుత్వానికి త్రుణప్రాయమని శివకాశిలో మొన్న చెలరేగిన మృత్యు మంటలు సాక్ష్యంగా నిలిచాయి. ఇప్పటికైనా పరిశ్రమల్లో భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమున్నది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమగ్ర దర్యాప్తు చేసి కఠిన చర్యలు చేపట్టాలి. మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు సముచిత స్థాయిలో పరిహారం అందించాలి. అన్ని విధాల ఆదుకోవాలి.