వరద ప్రాంతాల్లో ప్రధాని, సోనియా ఏరియల్‌ సర్వేమృతులు 77మంది.. మరో 50మంది గల్లంతు?

గౌహతి, జూలై 2 : అస్సాంలో సంభవించిన వరద బీభత్సం నష్టాన్ని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్‌గగోయ్‌తో కలిసి సోమవారంనాడు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. జోర్హాట్‌, సిబ్‌సాగర్‌, లక్ష్మీపూర్‌, డెమాజీ, మజూలీ ఐలెండ్‌ జిల్లాల్లో సంభవించిన వరద నష్టాన్ని హెలికాప్టర్‌ ద్వారా సందర్శించారని అధికారులు తెలిపారు. పూర్తిగా వరద నీటిలో మునిగిపోయిన ఖజిరంగ నేషనల్‌ పార్కును కూడా వీరు సందర్శించారు. అంతకుముందు ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీ జోర్హాట్‌ విమానాశ్రయానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకు న్నారు. వరద ప్రాంతాల సందర్శన అనంతరం వీరు గౌహతికి చేరుకుని వరద పరిస్థితిపై మంత్రులు, అధికారులతో చర్చించారు. అనంతరం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి వరద బీభత్సంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ.లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియోను ప్రకటించారు. ఇప్పటివరకు అస్సాం వరదల్లో 61మంది మరణించారు. మరో 50 మంది గల్లంతయ్యారు. పెను వరదలు, కొండచరియలు విరిగిపడడంతో మృతుల సంఖ్య అధికంగా ఉంది. కేవలం కొండ చరియలు విరిగి పడడం వల్ల 16మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. 103 రెవెన్యూ మండలాల్లోని 2166 గ్రామాల్లో 19.37లక్షల మంది ప్రజలు వరద బీభత్సానికి లోనయ్యారని అధికారులు తెలిపారు. వరద సహాయక బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.