వరవరరావుకు స్వల్ప ఊరట
ముంబయి,సెప్టెంబరు 24(జనంసాక్షి):భీమా కోరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావు.. తన బెయిల్ పొడిగించాలంటూ బాంబే హై కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌పై స్వల్ప ఊరట లభించింది. ఈ పిటిషన్ విచారణను చేపట్టిన బాంబే హైకోర్టు అక్టోబర్ 13కు వాయిదా వేసింది. దీంతో అక్టోబర్ 14 వరకు ముంబయిలోని తలోజా జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీంతో వరవరరావుకు మరికొన్ని రోజులు ఉపశమనం కలిగినట్లు అయ్యింది.ఎల్గర్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావుకు బాంబే హైకోర్టు ఆరు నెలలపాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న విడుదలైన ఆయన సెప్టెంబర్ 5ను తిరిగి లొంగిపోవాలని సూచించింది. తాజాగా ఆ గడువు ముగియడంతో బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ ఈ నెల మొదటి వారంలో బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నేటికి (సెప్టెంబర్ 24) వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ ఎస్‌ఎస్ షిండే, జస్టిస్ ఎన్‌జే జమాదార్‌లతో కూడిన ధర్మాసనం నేడు మరోసారి విచారణ చేపట్టింది. అయితే, సమయం తక్కువ ఉండడం వల్ల ఈ పిటిషన్ విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్న హైకోర్టు ధర్మాసనం.. అప్పటివరకూ లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. అంతకుముందు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ, వరవరరావు ఆరోగ్యం బాగానే ఉన్నందున బెయిల్ పొడిగించకూడదని కోర్టుకు విన్నవించింది.పుణె జిల్లాలోని భీమా కోరెగావ్‌లో 2018 జనవరి 1న హింస చెలరేగింది. 200 ఏళ్ల కింద జరిగిన భీమా కోరేగావ్ యుద్ధాన్ని స్మరించుకునేందుకు ఎల్గర్ పరిషత్ నేతృత్వంలో చేసిన ప్రయత్నం చివరకి అల్లర్లకు దారితీసింది. ఆ అల్లర్లలో ఒకరు మృతి చెందగా, పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. వీటితో పాటు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వరవరరావుతో సహా ఐదుగురిని 2018లో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 2020లో ఈ కేసును ఎన్‌ఐఏ చేపట్టింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి కన్నుమూసిన విషయం తెలిసిందే.