వరుస పేలుళ్లతో దద్దరిల్లిన పూనే

కేంద్ర హోంమంత్రి పర్యటించాల్సిన ప్రదేశంలోనే పేలుళ్లు
దేశవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ..ముమ్మర తనిఖీలు
పూణే : మహారాష్ట్రలోని పూణే నగరం వరుస బాంబుదాడులతో దద్దరిల్లింది. బుధవారం సాయంకాలం వేళ ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయంలో ఒక్క సారిగా జరిగిన ఈ దాడులతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలైన సాయంత్రం రద్దీగా ఉండే జంగ్లీ మహరాజ్‌ రోడ్డు ,బాలగంధర్వ ధియేటర్‌, దేనాబ్యాంక్‌, మెక్‌డోనాల్డ్‌ జాయింట్‌ ప్రాంతాలలో కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే తేలిక పాటి తీవ్రత కలిగిన ఐదు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఒకరు గాయపడ్డారు. అనంతరం అదే ప్రాంతంలోని ఒక చెత్తకుండీలో పేలని ఓ బాంబును కనుగొన్న పోలీసులు దానిని నిర్వీర్యం చేశారు. కొద్ది సేపట్లోనే మొత్తం ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. మహరాష్ట్ర ఏటీఎస్‌, బాంబు తనిఖీ, నిర్వీర్య బృందాలు పేలుళ్లు జరిగిన ప్రాంతాలకు హుటాహుటిన చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఇది తీవ్రవాదుల పనా అన్న ప్రశ్నకు మహరాష్ట్ర డీజీపీ సంజీవ్‌ దయాళ్‌ స్పందిస్తూ కేసు దర్యాప్తు జరుగుతున్నందున ఇపుడే ఏమీ చెప్పలేమని తెలిపారు.