వసతిగృహాలను సద్వినియోగం చేసుకోండి

దొనకొండ , జూలై 28 : ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యాభివృద్ధి నిమిత్తం అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వసతిగృహాలను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకొని వారి విద్యాభివృద్ధిని పెంపొందించుకోవాలని సహాయ సాంఘీక సంక్షేమాధికారిణి ఉదయశ్రీ తెలిపారు. స్థానిక ఎస్సీ బాలుర వసతిగృహంలో చేరేందుకు నూతనంగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను శనివారం నిర్వహించిన ఎంపిక కార్యక్రమంకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక ఎస్సీ బాలుర హాస్టల్‌కు మొత్తం 122 మంది విద్యార్థులు నూతనంగా దరఖాస్తు చేసుకోగా వారందరినీ ఎంపిక చేసి చేర్చుకున్నట్లు తెలిపారు. రెన్యువల్‌ విద్యార్థులు 140 మంది మొత్తం 262 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. వసతిగృహంలో ప్రస్తుతం ఉన్న పక్కా భవనం విద్యార్థులకు కొద్దిమేర ఇబ్బందిగా ఉన్నందున అదనపు గదుల నిర్మాణంకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని అన్నారు. తహసీల్దారు సి ఆశీర్వాదం మాట్లాడుతూ ఎస్సీ బాలుర వసతిగృహంకు సంక్షేమాధికారిగా శ్రీనివాసరావు విద్యార్థుల విద్యాభివృద్దికి ఎంతో కృషి చేస్తూ వసతిగృహ అభివృద్దికి తోడ్పాటు అందిస్తుండటంతో విద్యార్థులు సైతం వసతిగృహంలో చేరేందుకు ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారని అన్నారు. ఎంపిడివో ఎ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ స్థానికంగా ఉంటూ బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగిగా వార్డెన్‌ శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వసతిగృహ సిబ్బంది పాల్గొన్నారు.