విద్యుత్‌ ఎఇ నిర్బంధం

విజయవాడ, జూలై 29 : విద్యుత్‌ కోతలకు నిరసనగా అసిస్టెంట్‌ ఇంజనీర్‌ను నిర్బంధించిన సంఘటన ఆదివారం జరిగింది. కంచికచర్ల మండలం సెంచాల గ్రామంలో రోజుకు 14 గంటల వరకు కరెంట్‌ కోత విధిస్తున్నారు. దీనిపై అధికారులను అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో ఆదివారం గ్రామస్తులు ఊరేగింపుగా బయలుదేరి, కంచికచర్లలోని విద్యుత్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. విధుల్లో ఉన్న అసిస్టెంట్‌ ఇంజనీర్‌ బావన్నారాయణను గదిలో పెట్టి నిర్బంధించారు. కరెంట్‌ కోతలకు తగిన షెడ్యూలును పాటించాలని వారు డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా రంజాన్‌ దినాలు అయినందున ఉపవాస వేళల్లో, నమాజ్‌ సమయాల్లో కరెంట్‌ కోత లేకుండా చూడాలని వారు పట్టుబట్టారు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు రంగప్రవేశం చేసి గ్రామస్తులతో చర్చించారు. ఇకపై నిర్ణీత వేళల్లోనే విద్యుత్‌ కోత విధిస్తామని ఎఇ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.