వినూత్న పద్ధతిలో 12 జంక్షన్ల అభివృద్ధి
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్1(జనంసాక్షి):
ముఖ్యంగా పాదచారుల ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, క్రమబద్ధీకరణ కోసం జిహెచ్ఎంసి పరిధిలో జోన్ 2 చొప్పున ఆరు జోన్లలో 12 ట్రాఫిక్ జంక్షన్ లను ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు.
వివిధ మెట్రో పాలిటి నగరంలో చేపట్టిన ట్రాఫిక్ జంక్షన్ మాదిరిగా కాకుండా విభిన్నంగా ట్రాఫిక్ వలన ప్రమాదాలు అరికట్టడం, పాదచారులు సురక్షితంగా సులభంగా వెళ్లేందుకు దోహద పడే విధంగా జంక్షన్ల ను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ప్రయోగాత్మకంగా చేపడుతున్న జంక్షన్ల వలన మంచి ఫలితాలు వస్తే యుద్ద ప్రాతిపదికన అన్ని జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నలువైపులా పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, ఆర్ ఓ బి లు, ఆర్.యు.బి లు పటిష్టమైన రోడ్డు చేపట్టి వాహనదారులు సకాలంలో గమ్యస్థానానికి చేరే విధంగా కృషి చేయడం జరుగుతున్నది. నగరంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు వాహన క్రమబద్దీకరణ, వాహనాల ప్రమాదాల నివారణకు జంక్షన్ అభివృద్ధి, సిగ్నల్ వ్యవస్థను మెరుగు పరచడం జరిగింది. పాదచారులు ఇరువైపులా రోడ్డు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్లకు లిఫ్టులు, కొన్ని చోట్ల ఎస్కలెట్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన కూడలిలో వాణిజ్య సముదాయాలు, మాల్స్, వెళ్లేందుకు పాదచారుల ప్రయోజనం కోసం సుమారు రూ. 77 కోట్ల అంచనా వ్యయంతో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు చేపట్టారు. అందులో 7 అందుబాటులోకి రాగ మిగితావి వివిధ అభివృద్ధి దశలో కలవు.
వినూత్న పద్దతులతో నగర ప్రజల మౌలిక సదుపాయాలు అందుబాటులో తేవడానికి జిహెచ్ఎంసి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. జంక్షన్ల అభివృద్ధి కి జోన్ కు 2 చొప్పున 12 జంక్షన్ల ను చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నేపథ్యం లో జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా పనులు చేపట్టనున్నారు. నగరంలో 12 ప్రదేశాలలో రూ. 33 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. వివిధ కారణాల వలన జంక్షన్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భంలో ఎవరు ఇబ్బంది పడకుండా కొన్ని చోట్ల గార్డెనింగ్, కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్మెంట్ లాంటి వసతుల ఏర్పాటు చేస్తారు. స్థలం ఉన్న చోట అట్టి వసతులకు ప్రాధాన్యత ఇచ్చారు. కూకట్ పల్లి జోన్ లో గుల్ మోహర్ కాలనీ జంక్షన్ అభివృద్ధి సి ఎస్ ఆర్ క్రింద చేపట్టనున్నారు.
అభివృద్ధి చేసే జంక్షన్ వివరాలు
ఎల్బీనగర్ జోన్ లో హబ్సిగూడ, కొత్త పేట్(ఓల్డ్ సివిల్ కోర్టు హుడా కాంప్లెక్స్),చార్మినార్ జోన్ లో ఐఎస్ సదన్ ( ట్రాఫిక్ జంక్షన్ అభివృద్ధి) ఆరంఘర్(క్రాస్ రోడ్డు),ఖైరతబాద్ జోన్ లో సోమాజీగూడ, పంజా గుట్ట (రీ మోడలింగ్ ఆఫ్ ఫుట్ పాత్ ప్రొవైడింగ్ రైలింగ్, బోల్ లార్డ్,శేరిలింగంపల్లి జోన్ లో మియాపూర్ X రోడ్డు (రీ మోడలింగ్ ఫుట్ పాత్, ప్రొవైడింగ్ రైలింగ్, బొల్లార్డ్ ) గుల్ మోహర్ కాలనీ జంక్షన్,కూకట్ పల్లి జోన్ లో ఐడిపిఎల్ జంక్షన్ (చింతల్ గాజుల రామారం సర్కిల్( ఫుట్ పాత్, ఇస్ లాండ్, పెడెస్టేరియన్ క్రాసింగ్ పబ్లిక్ సిటింగ్ ) కృష్ణకాంత్ జంక్షన్,సికింద్రాబాద్ జోన్ లో నారాయణ గూడ జంక్షన్( అంబర్ పేట్ సర్కిల్ 16) సంగీత జంక్షన్ లను
అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు.
ఈ జంక్షన్ల అభివృద్ధి వలన ట్రాఫిక్ క్రమ బద్దీకరణ, పాదచారులు భద్రతతో పాటు సులభంగా వెళ్లడం, వాహనాల వేగం తగ్గడం వలన ప్రమాదాలను అరికట్టడం జరుగుతుంది. అట్టి పనులు ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. వాటి వలన మంచి ఫలితాలు వస్తే భవిష్యత్తులో మరిన్ని ట్రాఫిక్ జంక్షన్ లు అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటారు.