విపక్షాలకు కలసి వస్తున్న మోడీ వ్యతిరేక నిరసనలు


ప్రజాందోళనలను అనుకూలంగా మార్చుకుంటున్న ప్రతిపక్షం
దేశంలో పరిస్థితులతో మరిన్ని పోరాటాలకు సిద్దంగా నేతలు
న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లైనప్పటి నుంచీ ఏదో రూపంలో నిరసన ధ్వనులు వినపడుతూనే ఉన్నాయి. తొలి ఐదేళ్లలో పెద్దగా కానరాని నిరసనలు ఇప్పుడు ప్రజా ఉద్యమ రూపంలో కనిపిస్తున్నాయి. మోడీని పొగిడిన వారే తెగడుతున్నారు. ఇవే ఇప్పుడు విపక్షాలకు అస్త్రాలుగా మారాయి. పార్లమెంటు స్తంభనలో ఇది కనిపించింది. పెగాసస్‌పై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అయినా చివరకు మోడీయే విజయం సాధించారు. అయితే ఇది తాత్కాలికమే అనుకోవాలి. నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రజల అసంతృష్తిని గమనించకుండా అది అగ్గి రాజేస్తుంది. మోడీ ఇతర నేతలతో కానీ పెద్దలతో కానీ చర్చించే సాహసం చేయరు. అద్వానీ లాంటి వారి సలహాలు తీసుకోవడం లేదు. బిజెపికి పునాదిగా నిలిచిన వారంతా ఇప్పుడు తెరమరుగయ్యారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలు, జామియా, జేఎన్‌యూలో విద్యార్థి నిరసనలు… ఇవన్నీ కొన్ని రోజుల పాటు
ఎంత ఉద్రిక్త వాతావరణాన్ని కల్పించాయో అంతే వేగంగా సద్దుమణిగాయి. 9 నెలలుగా ఢల్లీిలో రైతుల నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా లక్షలాదివలస కార్మికులు మైళ్లకు మైళ్లు నడిచి వెళ్లడం, కరోనా రెండో ప్రభంజనం సందర్భంగా వేలాది రోగులు ఆక్సిజన్‌ సౌకర్యాలులేక మరణించడం, ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో పాటు ధరలు ఆకాశానికి అంటడం మోదీ ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేశాయి. దేశ రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాయనడం సత్య దూరం కాదు. పార్లమెంట్‌ సమావేశాలు జరిగిన ప్రతిసారీ రకరకాల ఉద్యమాలు నిర్వహించే ప్రజలు తమ నిరసన ప్రదర్శనలు నిర్వహించడం సాధారణం. ప్రభుత్వం తమ నిరసనలను పట్టించుకుంటుందనే ఆశపెద్దగా లేకపోయినా ఏదో ఒక రోజుపాలకుల గుండెలు కరగకపోతాయా అని ప్రజలు ఎదురుచూస్తూనే ఉంటారు. 2011లో యుపిఏ ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే నిర్వహించిన ఉద్యమం ఆ ప్రభుత్వ పతనానికి నాంది పలికింది. ఇలాంటి పరిస్థితులే ప్రతిపక్షాలకు కలసి వస్తాయి. పరిస్థితి మారుతున్నదని భావిస్తున్నందువల్లే ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ఏకం కావడానికి సన్నద్ధమవుతున్నాయి. ప్రజాసమస్యలకు తోడుగా పెగాసస్‌ నిఘా అంశం వారిని ఏకం చేసింది. రెండువారాలుగా పార్లమెంట్‌ను ప్రతిపక్షాలు స్తంభింపచేయడం, మొత్తం ప్రతిపక్షాలన్నీ ఏకం కావడం విస్మరించదగ్గ పరిణామం కాదు.కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా చురకుగా ప్రతిపక్షాలతో మాట్లాడగలడం చేస్తున్నారు. . ఒకప్పుడు రాహుల్‌ను ఏ మాత్రం పట్టించుకోని నేతలంతా ఇప్పుడు ఆయనతో చర్చిస్తున్నారు. ప్రతిపక్షాలను ఏ మాత్రం లెక్కచేయకుండా వారిని పూచికపుల్లలుగా చూసే మోడీ తీరు ఇప్పుడు వారిని ఏకం చేస్తోంది. పార్లమెంట్‌లో కీలకబిల్లుల విషయంలో తమను విశ్వాసంలోకి తీసుకోకపోవడం, పార్లమెంటరీ కమిటీలను బేఖాతరు చేయడం, ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు కనీసం తమతో చర్చించాలన్న ఆలోచనే లేకపోవడం విపక్షాలు అవమానభారంతో రగులుతున్నాయి.
2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే నాటికి బిజెపి ఏడు రాష్టాల్లో అధికారంలో ఉన్నది. ప్రస్తుతం 12 రాష్టాల్లో స్వంతంగా అధికారంలో ఉండగా, ఆరు రాష్టాల్లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ మిత్రపక్షాలు కలిసి ఆరు రాష్టాల్ల్రోనే అధికారంలో ఉన్నాయి. 2024 నాటికి ఈ పరిస్థితి మారి కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు, ఇతర బిజెపియేతర ప్రతిపక్షాలు పై చేయి సాధిస్తే కానీ మోదీని ఎదుర్కోవడం సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా ఈలోపు ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ తదితర రాష్టాల్లో బిజెపిపై కాంగ్రెస్‌, ప్రతిపక్షాలది పైచేయి కావాలి. ఆ తర్వాతే వారంతా ఒక కూటమిగా ఏకం కావడం, బిజెపికి ప్రత్యామ్నాయం ఏర్పడడం సాధ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.