వీసీని రీకాల్‌ చేయాలి

కడప, జూలై 25 : యోగివేమన విశ్వవిద్యాలయంలో పరిశోధన ప్రవేశాలలో రిజర్వేషన్ల ఉల్లంఘనకు కారణమైన వైస్‌ చాన్స్‌లర్‌ రామచంద్రారెడ్డిని రీకాల్‌ చేయాలని ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి డిమాండ్‌ చేశారు. పిహెచ్‌డి సీట్లను రామచంద్రారెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు రోస్టర్‌ విధానాన్ని పాటించకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు పూర్తిగా నష్టపోయారని ఆయన అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.