వృక్ష సంపదపైనే పర్యావరణ పరిరక్షణ

విజయనగరం, జూలై 31 : పర్యావరణ పరిరక్షణ వృక్ష సంపదపైనే ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్థానిక పల్లవి విద్యామందిర్‌ కరస్పాండెంట్‌ శేఖర్‌ పేర్కొన్నారు. పట్టణంలోని పల్లవి విద్యా మందిర్‌ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ గ్రీన్‌కోర్‌ ర్యాలీ మంగళవారం నాడు జరిగింది. ఈ ర్యాలీని మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ రాజేష్‌, పాఠశాల కరస్పాండెంట్‌ శేఖర్‌ ప్రారంభించారు. సందర్భంగా కరస్పాండెంట్‌ శేఖర్‌ మాట్లాడుతూ, వృక్ష సంపద ఎంత అభివృద్ధి చెందితే అంత సురక్షితంగా పర్యావరణం ఉంటుందన్న విషయాన్ని తెలియజేప్పేందుకే గ్రీన్‌కోర్‌ సౌజన్యంతో ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. వృక్షాలను నరికివేయవద్దని అన్నారు. ఒక్కో వృక్షం నుంచి ఎంతో విలువైన ప్రాణవాయువు ఉత్పన్నం అవుతుందో వివరిస్తే వృక్షాలను విచ్చలవిడిగా నరికివేసే విధానానికి తెరపడుతుందన్నారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించాలి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలంటూ ప్లకార్డులు చేతపట్టుకొని, విద్యార్థులు ర్యాలీ వెంట నడిచారు. ఈ ర్యాలీలో పాఠశాల ప్రిన్సిపల్‌ వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.