వెయ్యి పాఠశాలలో లక్ష మొక్కలు నాటాలి : వీరబ్రహ్మయ్య

విజయనగరం, జూలై 31 : జిల్లాలో వెయ్యి పాఠశాలల్లో లక్ష మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని, పాఠశాలలో నాటే మొక్కలను విద్యార్థులు జాగ్రత్తగా పరిరక్షించాలని జిల్లా కలెక్టర్‌ ఎం. వీరబ్రహ్మయ్య చెప్పారు. మంగళవారం 63వ వన మహోత్సవం సందర్భంగా నెల్లిమర్ల మండలంలోని వేణుగోపాలపురం ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్‌ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టరు మాట్లాడుతూ … పదిసంవత్సరముల క్రితం డిఆర్‌డిఎ అధికారిగా వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటామని, ప్రస్తుతం అవి పెద్ద మొక్కలు అయ్యాయని, ఈ పాఠశాల ఆవరణలో నాటిన 300 మొక్కలను కూడా విద్యార్థులు ప్రత్యే శ్రద్ధతో చూసుకొని పెంచాలని ఆయన పేర్కొన్నారు. డి.సి.ఎం.ఎస్‌. చైర్మన్‌ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ మొక్కల నాటే కార్యక్రమం మంచి కార్యక్రమం అని పాఠశాలలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను నాటించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డి.ఎఫ్‌.ఓ., విజయనగరం ఐ.కె.వి. రాజు మాట్లాడుతూ గతంలో ఈ పాఠశాల ఆవరణలో వేసిన మొక్కలు పెద్దవై మీకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. అనంతరం వనమహోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు డి.సి.ఎం.ఎస్‌. చైర్మన్‌, అధికారులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆర్‌. శ్రీరాములనాయుడు, రాజీవ్‌ విద్యామిషన్‌ ప్రాజెక్టు అధికారి కె.వి.రమణ, డి.ఎఫ్‌.ఓ. జ్యోతి, ఎ.పి.ఎస్‌.డబ్ల్యు. గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్‌ రామానాయుడు, నెల్లిమర్ల మండలం తహశీల్దారు జయదేవి, నెల్లిమర్ల ఎం.డి.ఓ., అటవీ శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.