వేణుగోపాలా.. ని దారి ఎటు?

ఆదిలాబాద్‌, జూలై 21: తెలుగుదేశం సీనియర్‌ నాయకులు, ముదోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలాచారిని పార్టీ నుండి సస్పెండ్‌ చేయడంపై జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం, సకల జనుల సమ్మె చేపట్టడంతో తెలంగాణలోని ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఒత్తిడి తేవడంతో నాగం జనార్దన్‌రెడ్డితో బయటికి వచ్చిన చారిని పార్టీ అధిష్ఠానం ఎట్టకేలకు సస్పెండ్‌ చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని కాదని ఓటేయడంతో గత్యంతరం లేక చారిని పార్టీలో ఉండనీయకుండా స్థానిక ఎంపి రమేష్‌ రాథోడ్‌ ఒత్తిడి మేరకు చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతుంది. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశంలో ఉంటూ మూడు సార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపిగా రాష్ట్ర, కేంద్రమంత్రిగా పని చేసి జిల్లాలో పార్టీలో చక్రం తప్పిన వేణుగోపాలచారి ఎట్టకేలకు పార్టీనుండి బయటకు రావడంతో ఏ పార్టీలో చేరుతారనే చర్చ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీని జిల్లాలో బలోపేతం చేయడమే కాకుండా కొత్త వారికి పార్టీ టికెట్‌ ఇప్పించి ఎమ్మెల్యేలుగా గెలిపించిన ఘనత చారికి ఉంది. చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న వేణుగోపాలాచారికి 1985లో ఎన్టీ రామారావు టికెట్‌ ఇవ్వకపోవడంతో చంద్రబాబునాయుడుతో ఎన్టీఆర్‌పై ఒత్తిడి తెచ్చి టికెట్‌ సాధించి గెలిచిన చరిత్ర ఆయనకు ఉన్నది. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అన్ని తానై ఉండి జిల్లాలో పార్టీకి కంచికోటగా ఉంచడంలో వేణుగోపాలచారికి ప్రధాన పాత్ర ఉంది. గత కొంతకాలంగా ఆయన శిశుడు ఎంపి రమేష్‌ రాథోడ్‌తో విభేదాలు రావడంతో పార్టీకి దూరంగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. పార్టీ నుండి సస్పెండ్‌ అయిన వేణుగోపాలాచారి తన భవిష్యత్‌ ప్రణాళిక విషయమై ఇంతవరకు ప్రకటించలేదు.