వైఎస్‌ఆర్‌ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకి కాదు

కరీంనగర్‌, జూలై 21 : వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం తెలంగాణకు వ్యతిరేకం కాదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆదిశ్రీనివాస్‌ శనివారం అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో, శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ప్రాంతానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అందించారని అన్నారు. ఆయన పట్ల గిట్టని వ్యక్తులు కొందరు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. సిరిసిల్లలోని చేనేత కార్మికులకు మద్దతుగా వైఎస్‌ విజయమ్మ ఈ నెల 23న రానున్నారని, ఈ సందర్భంగా ఆమె ఘన స్వాగతం పలికి ఆహ్వానించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, బాబు, ఎన్‌.పోశెట్టి పాల్గొన్నారు.