వైకాపాను గెలిపిస్తే రాష్ట్రం ముక్కలౌతదన్నరు కదా!


రాష్ట్ర విభజనకు సీమాంధ్ర ప్రజలు ఆమోదించిండ్రు
– మీ మాటకే కట్టుబడి తెలంగాణకు సహకరించుండ్రి
– అధిష్టానానికి టైం ఇచ్చినం.. మాకు సమయం ప్రజలు ఇస్తలేరు..
కేకే ఇంట్లో టీ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం
జెండాలు పక్కనపెట్టి పోరాడాలని నిర్ణయం

హైదరాబాద్‌ – ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే రాష్ట్రం ముక్కలవుతదంటూ ప్రచారం సాగించిన ఆ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు ఆ మాటలకు కట్టుబడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సహకరించాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు కోరారు. పరకాల ఫలితంపై సమీక్షించేందుకు శనివారం కే.కేశవరావు ఇంట్లో టీ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరకాలలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులపై లోతుగా విశ్లేషణ జరిపారు. గడపాటి రాజగోపాల్‌తోసహా పలువురు సీనియర్‌ నాయకులు సీమాంధ్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే రాష్ట్ర విభజన జరుగుతుందని, కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తేనే రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందంటూ జోరుగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ సీమాంధ్ర ప్రజలు జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే అఖండ మెజార్టీతో గెలిపించడం ద్వారా రాష్ట్ర విభజనకు తామూ అనుకూలమే సంకేతాలు ఇచ్చారన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులు ఉప ఎన్నికల్లో చెప్పిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సహకరించాలని వారు కోరారు. తెలంగాణను తేల్చే విషయంలో ఇంకా నాన్చివేత, దాటవేత ధోరణిని ప్రదర్శిస్తే సహించే స్థితిలో ప్రజలు లేరన్నారు. తెలంగాణపై నిర్ణయం ప్రకటించేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలుగా తాము కొంత సమయం ఇచ్చామని, అయితే ప్రజలు మాత్రం తమకు సమయం ఇవ్వడం లేదని వారు వాపోయారు. ఉప ఎన్నికల ఫలితాలతోనైనా తెలంగాణపై సానుకూల నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని టీ కాంగ్రెస్‌ ఎంపీలు అధిష్టానాన్ని కోరారు. తెలంగాణ సాధన కోసం పార్టీలు, జెండాలు పక్కనబెట్టి పోరాడాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ………………తదితరులు పాల్గొన్నారు.