శంభో శంకర..

– శివనామస్మరణలతో మారుమోగిన శైవక్షేత్రాలు
– రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు
– భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
– వేములవాడలో పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
హైదరాబాద్‌, మార్చి4(జ‌నంసాక్షి) : హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ తెలంగాణలోని శైవక్షేత్రాలు మారుమోగాయి.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రాంభమయ్యాయి. రాష్ట్రంలోని శివాలయాలన్నీ తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన శివాలయాల్లోనూ తెల్లవారుజామునుంచే పూజలు ప్రారంభమయ్యాయి.
నిర్మల్‌ జిల్లాలోని బాసరలో మహాశివరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. గోదావరి తీరంలో ఉన్న సూర్యేశ్వరాలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఉదయాన్నే ప్రత్యేక పూజలు చేశారు. సూర్యేశ్వరస్వామికి అభిషేకం, బిల్వార్చన నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు మహాలింగార్చన, లక్ష దీపాల ప్రజ్వలన ఉంటుంది. వ్యాసేశ్వర, సూర్యేశ్వర ఆలయాల్లో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవ పూజలు జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా బాసరకు భక్తులుభారీగా తరలివచ్చారు. తెల్లవారు జామునే ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరప్రాంతాలు శివరనామస్మరణతో మారుమోగాయి.. అదేవిధంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని శ్రీకాళేశ్వర-ముక్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని 50ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. వరంగల్‌లోని వేయిస్తంభాల గుడిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి సుప్రభాత సేవ, సామూహిక రుద్రాభిషేకాలను నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు శ్రీరుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరీదేవి కల్యాణోత్సవం జరిగింది. రాత్రి 12గంటలకు లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అదేవిధంగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. రామలింగేశ్వ రస్వామికి సుప్రభాత సేవ, గణపతి పూజ నిర్వహించారు. స్వామివారికి అఖండ దీపారాధన, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. రాత్రి 10 గంటలకు శ్రీస్వామివారికి కల్యాణ మ¬త్సవం జరగనుంది.
వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు..
వేములవాడ రాజన్న గుడిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. కాగా శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం రాజన్నకు రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. అంతకుముందు టీటీడీ అర్చకులు, అధికారులు శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మరోవైపు రాజన్న ఆలయంలో దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులు కోడె మొక్కులు తీర్చుకుంటున్నారు. అదేవిధంగా శ్రీరాజరాజేశ్వరస్వామివారికి టీటీడీ నుంచి వట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ అర్చకులు, అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. నిజామాబాద్‌ నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక అభిషేకాలు
నిర్వహించారు. ఆర్మూర్‌ సిద్దుల గుట్ట దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు.  మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని నల్గొండ జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పానగల్‌లోని ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే వాడపల్లిలోని అగస్తేశ్వర స్వామి ఆలయంలో శివుడికి అభిషేకాలు, మహాన్యాసపూర్వక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని స్వయంభూశంభు లింగేశ్వరస్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దంపతులు, అలాగే టీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ దంపతులు కూడా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేములవాడ మహాశివరాత్రి వేడుకలో అపశృతి..
రాజన్నసిరిసిల్ల: వేములవాడలోగల రాజరాజేశ్వరీ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన శ్రీకాంత్‌ అనే భక్తుడు వేములవాడ రాజన్న దేవాలయానికి వచ్చాడు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు క్యూలైన్‌లో నిలుచుని ఉండగా మరో క్యూలైన్‌లోకి దూకే క్రమంలో ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి భక్తులు ఆయన్ను సవిూపంలోగల దేవాలయానికి చికిత్స నిమిత్తం తరలించారు.