.శ్రీలంకలో ముదురుతున్న ఆర్థిక సంక్షోభం
` చమురు కొనుగోళ్లకు నిధులు కరువు
` 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వాలని భారత్‌కు అభ్యర్థన
కొలంబో,అక్టోబరు 17(జనంసాక్షి):శ్రీలంకలో విదేశీ మారకద్రవ్య సంక్షోభం తీవ్రమైంది. ప్రస్తుతం ఆ దేశంలో చమురు కొనుగోళ్లకు చెల్లించేందుకు కూడా నిధులు లేవు. దీంతో 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వాలని భారత్‌ను కోరింది. ప్రస్తుతం ఉన్న చమురు నిల్వలు వచ్చే జనవరి వరకు మాత్రమే సరిపోతాయని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్‌పిలా హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ ప్రతిపాదన వచ్చింది. ప్రభుత్వ రంగంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ దాదాపు 3.3 బిలియన్ డాలర్లను బ్యాంక్ ఆఫ్ సిలోన్, పీపుల్స్ బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది. ఈ సంస్థ మిడిల్‌ఈస్ట్, సింగపూర్ నుంచి వివిధ రకాల పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకొంటోంది. ‘‘భారత్ నుంచి 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ కోసం భారత్ హైకమిషన్‌లో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇండో`శ్రీలంక ఎకనామిక్ పార్టనర్ షిప్ ఒప్పందంలో భాగంగా దీనిని కోరుతున్నాం’’ అని సీపీసీ ఛైర్మన్ సుమిత్ విజయ్‌సింఘే పేర్కొన్నారు. ఈ నిధులను పెట్రోలియం, డీజిల్ దిగుమతులకు వినియోగిస్తామని తెలిపారు. త్వరలో భారత్, శ్రీలంక ఇంధన శాఖ కార్యదర్శులు ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. గత ఏడాది కాలంగా శ్రీలంకను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు భారీగా పడిపోయాయి. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి పర్యాటకరంగంపై తీవ్ర ప్రభావం పడిరది. దీంతో ఉన్న కాసిన్ని విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లంక ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది.