సమాజ హితమే స్వచ్ఛంద సంస్థల ధ్యేయం

విజయనగరం, జూలై 26 : సమాజ హితమే స్వచ్ఛంద సంస్థల ధ్యేయం కావాలని లైన్స్‌క్లబ్‌ రీజనల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సిహెచ్‌ పద్మావతీనాయుడు పేర్కొన్నారు. స్థానిక ప్రైవేట్‌ అతిథి గృహంలో లైన్స్‌క్లబ్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మావతీ నాయుడు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా ఎన్నో సంస్థలకు లైన్స్‌క్లబ్‌ స్ఫూర్తినిచ్చిందన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణ ద్వారా గడిచిన 50 ఏళ్లలో వేలాది మందికి కంటిచూపును ప్రసాదించిందన్నారు. నేటితరం యువత కూడా ఇదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా లైన్స్‌క్లబ్‌ ప్రతిష్టను మరింత పెంచాలని విజ్ఞప్తి చేశారు. క్లబ్‌ అధ్యక్షుడు జి.నారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి బిఎస్‌ కాళీరావు మాట్లాడుతూ విజయనగరం లైన్స్‌క్లబ్‌ సభ్యులందరి సహకారంతో క్లబ్‌ను సంఖ్యాపరంగా పటిష్టపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ పూర్వపు గవర్నర్‌ ఫర్వేజ్‌ హష్మి, సీనియర్‌ ప్రతినిధులు సుంకర సత్యారావు, కాళీరావు, కొండబాబు, రాజ్‌గోపాల్‌ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి క్లబ్‌ ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.