సరిహద్దుల్లో బరితెగించిన చైనా సైనికులు
తిప్పికొట్టిన భారత సైన్యం
న్యూఢల్లీి,అక్టోబర్8 (జనంసాక్షి) : సరిహద్దుల్లో చైనా మరోసారి బరితెగించింది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో చైనా ఆర్మీ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ యాంగ్సే సవిూపంలో భారత, చైనా బలగాలు మళ్లీ తలపడ్డాయి. దీంతో ఇరు దేశాల సైనికుల మధ్య కొన్ని గంటలపాటు ఘర్షణ వాతావరణం నెలకొంది. భారత బంకర్లను ధ్వంసం చేసేందుకు చైనా ఆర్మీ యత్నించింది. దీంతో భారత సైన్యం చైనా కుట్రలను ధీటుగా తిప్పికొట్టింది. కాగా, రెండు దేశాల సైనికులు తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రొటోకాల్స్ ప్రకారం రెండు దేశాలకు చెందిన స్థానిక కమాండర్లు మధ్య చర్చల అనంతరం పరిస్థితి చక్కబడిరది. గతవారంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా గస్తీ బృందం భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడంతో వారిని బలవంతంగా వెనక్కి పంపించినట్టు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్ వివాదంపై ఇరువర్గాల మధ్య మరోవిడత ఉన్నత స్థాయి మిలటరీ సమావేశాలకు ముందు ఈ సంఘటన వెలుగుచూసింది. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సమావేశం జరుగనున్నట్టు చెబుతున్నారు. తాజాగా ఇరు దేశాల బలగాలు ముఖాముఖీ తలబడటంతో సరిహద్దుల వద్ద పెట్రోలింగ్ కార్యకలాపాలు పటిష్టం చేశారు. తాజా ఘటనపై ఒక అధికారి మాట్లాడుతూ, పరస్పర అంగీకారంతో ఇరు బలగాలు వెనక్కి మళ్లడానికి ముందు బలగాలు మధ్య తోపులాట చోటుచేసుకుందని, అయితే రక్షణ ఏర్పాట్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపారు.