సాగర్‌ నీళ్లను ఎత్తుకెళ్లిన్రు !

– నిబంధనలకు నీళ్లొదిలిన రాష్ట్ర ప్రభుత్వం
– దర్జాగా హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన
– రాత్రికి రాత్రి కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్‌ నీటి విడుదల
– భారీ భద్రత నడుమ 350 క్యూసెక్కుల నీటి తరలింపు
– మండిపడుతున్న తెలంగాణవాదులు

హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి) : మరోసారి రాష్ట్ర సర్కారు సీమాంధ్ర పక్షమేనని నిరూపించింది. తెలంగాణపై చూపేదంతా సవతి తల్లి ప్రేమేనని చెప్పకనే చెప్పింది. సీమాంధ్ర సంక్షేమానికి పాలకులు అవసరమైతే చట్టాలను ఉల్లంఘిస్తారని, తెలంగాణ ప్రయోజనాలను గాలికి వదిలేస్తారని మండిపడే తెలంగాణవాదుల ఆరోపణల్లో రవ్వంతైనా అబద్ధం లేదని తెలిసి వచ్చేలా కృష్ణాకు డెల్టాకు నీటిని విడుదల ప్రభుత్వం తన ఫక్షపాత ధోరణిని చూపించింది. ఇదంతా నిజం. కొన్ని రోజుల కిందటే నాగార్జున సాగర్‌ నీళ్లను కృష్ణా డెల్టాకు విడుదల చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా తాగేందుకు గుక్కెడు నీళ్ల లేకుండా ఎండుతున్నా కృష్ణా డెల్టాకు నీళ్లను విడుదల చేయడమేందని తెలంగాణవాదులు ప్రభుత్వ చర్యలను తూర్పారబట్టారు. ఈ విషయంపై స్పందించిన హై కోర్టు తెలంగాణవాదుల ఆవేదనలో నిజముందని, నాగార్జున సాగర్‌ నీటి మట్టం 525 అడుగులకు తక్కువగా ఉంటే డెల్టాకు నీటిని విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బేఖాతరు చేసింది. సీమాంధ్ర పక్షపాతిగా మారి తెలంగాణవాదులకు తెలియకుండా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 4 గంటల వరకు డెల్టాకు 350 క్యూసెక్కుల నీళ్లను సాగర్‌ కుడి కాలువ ద్వారా విడుదల చేసి చట్టాన్ని అతిక్రమించింది. అంతే కాకుండా, ఈ దుశ్చర్యను ఎక్కడ తెలంగాణవాదులు అడ్డుకుంటారోనని భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసి సీమాంధ్రపై తమకున్న ప్రేమను చాటి చెప్పింది. హై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నాగార్జున సాగర్‌ నీటి మట్టం 525 అడుగుల కన్నా ఎక్కువుంటేనే నీళ్లను విడుదల చేయాలి. కానీ, ఆదివారం రాత్రి సాగర్‌ నీటి మట్టం 511 అడుగులు మాత్రమే ఉంది. ఈ లెక్కన హై కోర్టు ఆదేశాల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ సాగర్‌ నీళ్లను విడుదల చేయడానికి వీలు లేదు. కానీ, ప్రభుత్వం వీటినేమీ పట్టించుకోకుండా అప్పనంగా 350 క్యూసెక్కుల నీటిని డెల్టాకు గుట్టుచప్పుడు కాకుండా తరలించేసింది. ‘చేసిందే దొంగతనం.. ఆపై దర్జాతనం’ అన్నట్లు ఎత్తుకెళ్లిన నీళ్లకు పోలీసులను పహారాకు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణవాదులు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణ ప్రయోజనాలను సీమాంధ్రుల కోసం కాజేసిందని ఆరోపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే దాకా ప్రభుత్వం ఇలాంటి మోసాలు చేస్తూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని హై కోర్టు దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వపు ఈ దుశ్చర్యతోనైనా తెలంగాణ ఏ స్థాయిలో అన్యాయం జరుగుతున్నదో కేంద్రం తెలుసుకోవాలని, వెంటనే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే, సాగర్‌ జలాల తరలింపుపై తెలంగాణ అంతటా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణవాదులు ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.