సాగునీటి కోసం సమరం

నిండుకుంటున్న ప్రకాశం బ్యారేజి
విజయవాడ, జూలై 31: కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా హనుమాన్‌జంక్షన్‌లో మంగళవారం టిడిపి నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నడిరోడ్డుపై వారు బైఠాయించడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. బుధవారం నుండి కృష్ణాడెల్టాకు ప్రభుత్వం సాగునీరు నిరాటంకంగా సరఫరా చేయని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆమరణ నిరాహారదీక్షలు ప్రారంభిస్తామని టిడిపి నేతలు హెచ్చరించారు. ప్రభుత్వం జాప్యం చేసే కొద్ది రైతులు తీవ్రంగా నష్టపోతారని వారన్నారు. జిల్లా టిడిపి అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, టిడిపి ఎమ్మెల్యేలు బాలవర్దన్‌రావు, ప్రభాకరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం 10.9 అడుగులకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో పై నుండి నీరు రాకుంటే బుధవారం నుండి కృష్ణాడెల్టాకు నీరు ఇవ్వలేమని ఇరిగేషన్‌ శాఖాధికారులు తేల్చి చెప్పారు.