సాగు చట్టాలను రద్దు చేస్తామంటే నమ్మాలా
మిమ్మల్ని నమ్మేదెలా: ప్రియాంకా గాంధీ
లక్నో,నవంబర్19 (జనం సాక్షి ) వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారని విూరంటున్నారు, కానీ మిమ్మల్ని నమ్మేదెలా అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. సాగుచట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఆమె విూడియాతో మాట్లాడారు. ప్రధాని ఎందుకు చట్టాలను రద్దు చేస్తున్నారు, ఎన్నికలు దగ్గరపడుతున్నాయన్న విషయం ప్రజలకు అర్థం కావడం లేదా, బహుశా వాళ్లకు పరిస్థితి అనుకూలంగా లేదని, సర్వేల్లో వాళ్లకు పరిస్థితి అర్ధమవుతోందని, అందుకే ఎన్నికల ముందు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రియాంకా ఆరోపించారు. రైతులు ఆందోళనజీవులను, గుండాలని, ఉగ్రవాదులని, దేశద్రోహులని ప్రభుత్వ నేతలు విమర్శలు చేశారని, అన్ని మాటలంటుంటే ప్రధాని ఎందుకు ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నిరసన చేపడుతున్న రైతుల్ని ఆందోళనజీవులను ప్రధానియే స్వయంగా అన్నట్లు ప్రియాంకా ఆరోపించారు. రైతుల్ని చంపేశారని, వారిపై లాఠీలను వాడారని, అరెస్టులు చేశారని, ఇవన్నీ ఎవరు చేశారని ఆమె ప్రశ్నించారు. ఇదంతా ప్రభుత్వమే చేసిందని ప్రియాంకా విమర్శించారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ మిమ్మల్ని ఎలా నమ్మాలంటూ ఆమె ప్రశ్నించారు. ఈ దేశంలో రైతుల కన్నా మిన్న ఎవరులేరన్న విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవడం సంతోషంగా ఉందని ప్రియాంకా గాంధీ అన్నారు.