సింగరేణికి నర్సులు కావలెను…

గోదావరిఖని, మే 26, (జనం సాక్షి) : భారతదేశ పారిశ్రామిక రంగంలో సింహభాగాన ఉన్న సింగరేణి కాలరీస్‌లో పనిచేసే కార్మికులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. అధికారులకు అందించే వైద్య సేవల్లో సగభాగమైన కార్మికులకు అందడం లేదని ఆరోపణలు నిత్యం ఉన్నాయి. చివరకు… సింగరేణి ఆసుపత్రుల్లో నర్సుల నియామకాలను యాజమాన్యం జరపడంలో జరుగుతున్న జాప్యంపై అన్ని పక్షాలు ఆక్షేపిస్తున్నాయి. అయితే… బొగ్గుగనులు విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల్లో ప్రాముఖ్యతను సంతరించుకున్న గోదావరిఖని సింగరేణి 200పడకల ప్రధాన ఆసుపత్రికి నర్సుల కొరత ఏర్పడింది. కొన్నాళ్లుగా ఆసుపత్రిలో నర్సుల నియామకాన్ని యాజమాన్యం నిలిపివేయడంతో… వీరి సేవలు రోగులకు అందకపోవడం పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నిత్యం ఈ ఆసుపత్రిలోని ప్రతివార్డులో చెప్పుకోదగ్గ సంఖ్యలో రోగులు ఇన్‌పేషంట్లుగా వైద్యం పొందుతుండగా… వారికి సేవలందడంలో జాప్యం జరుగుతోంది. సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రిగా పేరొందిన ఈ ఆసుపత్రిలో కార్మికులు, కార్మిక కుటుంబాలు, కార్మికుల ఆధారితులు చికిత్స పొందుతుంటారు. ప్రతిరోజు ఈ ఆసుపత్రిలో సుమారు 500మందికి పైగా అవుట్‌ పేషంట్లుగా వైద్యం పొందుతుండగా… దాదాపుగా ప్రతిరోజు 100మందికి పైగా ఇన్‌పేషంట్లుగా వైద్య సేవలందించాల్సి వస్తుంది. అయితే… ఈ ఆసుపత్రిలో ఉన్న పేషంట్ల రద్దీకి అనుగుణంగా వైద్యులు ఏదోవిధంగా యాజమాన్యం సరిపెడుతుంది. చాలామంది వైద్యులు ఈ ఆసుపత్రిని ‘కార్ఖనా’గా మార్చుకుని ఉద్యోగంలో చేరిన కొన్నాళ్ళకే రాజీనామా చేస్తున్నారు. వేరే ఆర్గనైజేషన్ల చేరడమో… స్థానికంగా ప్రైవేట్‌ఆసుపత్రిని నెలకొల్పడమో… జరుగుతున్న క్రమంలో కార్మికులకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నామని… యాజమాన్యం చెబుతున్న మాటలు గాలిమూటలవుతున్నాయి. ఆసుపత్రిలో చెప్పుకోదగ్గ స్థాయిలో మౌళిక వసతులను యాజమాన్యం చక్కగా ఏర్పరిచినప్పటికి… వైద్య సేవలందించే సిబ్బంది నియామకంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంలో గల ఆంతర్యం బహిర్గతం కావడం లేదు. నిబంధనల ప్రకారం క్యాజువల్‌ వార్డులో ప్రతి ముగ్గురు రోగులకు ఒక నర్సు సేవలు అందించాల్సి ఉండగా… ఐసీయూలో ఒక రోగికి ఒక నర్సు వైద్య సహాయాన్ని అందించాలి. అలాగే, వార్డుల్లో ప్రతి 20మంది రోగులకు ముగ్గురు నర్సులు వైద్య సహాయాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు పెద్దపీట వేసే సింగరేణి యాజమాన్యం ఆసుపత్రిలో నిబంధనలను నీరుగారుస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. ఈ పై విషయాలను డబ్ల్యూహెచ్‌ఓ, ఎంసీఐ, ఎన్‌సీఐ నిర్ధారిస్తుంది. కాగా, మేడిపండులా… ఈ ప్రధాన ఆసుపత్రిలో వైద్య సహాయం లోపభూయిష్టంగా తయారైందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇంతజరుగుతున్న కార్మిక సంఘాలు మౌనపాత్ర వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సింగరేణిలో నర్సుల నియామకాన్ని జరపకపోవడం పట్ల తెలంగాణ సింగరేణి అధికారుల ఫోరం కన్వీనర్‌ డాక్టర్‌ శంకర్‌నాయక్‌, తదితరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణిలో 250మంది నర్సులు కావాల్సిఉండగా, కేవలం 50మంది నర్సుల నియామకం కోసం యాజమాన్యం ప్రకటన ఇవ్వడం విడ్డూరంగా ఉందని వారన్నారు. ఈ నియామకాలను సరిపడేంత రీతిలో జరుపకపోతే ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు.