సిపిఐ పాదయాత్రలు ప్రారంభం

విజయనగరం, జూలై 21 : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీల్లో పేరుకుపోతున్న సమస్యలపై ప్రజలను చైతన్యపరిచి అధికారులను అప్రమత్తం చేసేందుకుగాను సోమవారం నుండి సిపిఐ పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా శనివారం ఉదయం స్థానిక బిచ్చన్నకోనేరు ప్రాంతం నుంచి సిపిఐ పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. మూడు రోజుల పాటు పట్టణంలోని వార్డులను పర్యటించి సమస్యలను తెలుసుకుంటామని సిపిఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు చెప్పారు. అంతేకాక ఈ నెల 23న మున్సిపల్‌ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. మూడు రోజుల పాటు పట్టణంలోని అన్ని వార్డుల పర్యటన పూర్తి చేస్తామని, అనంతరం సమస్యలపై నివేదిక తయారు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సూరిబాబు, అశోక్‌, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.