సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

* జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్

జూలూరుపాడు, ఆగష్టు 21, జనంసాక్షి: కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోడీ ఊడిగం చేస్తూ ప్రభుత్వ సంస్థలను అంబానీ, ఆదానీలకు కట్టబెట్టి వారిని మరింత సంపన్నులుగా మారుస్తున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ ఆరోపించారు. ఆదివారం జూలూరుపాడులో జరిగిన మండల కార్యవర్గ సమావేశం కొండ వీరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బిజెపి ప్రభుత్వం ధరలను విపరీతంగా పెంచి పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ వ్యవస్థలకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా పోరాటాలు ఎజెండాగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సెప్టెంబర్ 4,5,6,7 తేదీల్లో శంషాబాద్ లో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, ఈ సభలకు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ మండల సహాయ కార్యదర్శులు గార్లపాటి వీరభద్రం, చాంద్ పాషా, మండల కార్యవర్గ సభ్యులు ఎల్లంకి మధు, నాగుల్ మీరా, గుండెపిన్ని మధు, వెంకటేశ్వర్లు, పొన్నెకంటి వెంకటేశ్వర్లు, నరసింహారావు, పగడాల అఖిల్, భూక్య శంకర్, గార్లపాటి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.