సిసి రోడ్డు మంజూరు ఒక చోట.. పనులు మరొక చోట..! – పెంచికల్ పేటలో నిబంధనలకు విరుద్ధంగా సిసి రోడ్డు నిర్మాణం – అధికారుల అండతో పాలకుల నిర్వాహకం..? – నిధులు మంజూరైన హనుమాన్ గుడి వరకు రోడ్డు వేయాలని గ్రామస్తుల డిమాండ్
జనం సాక్షి, మంథని : రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్లు అధికారులు, పాలకులు ఒకటైతే ఏ పనైనా చేయవచ్చు అని నిరూపిస్తున్న ఘటన పెద్దపెల్లి జిల్లా మంథని నియోజక వర్గం పరిధిలోని కమాన్ పూర్ మండలం పెంచికల్ పేట గ్రామంలో చోటుచేసుకుంది..!. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద పెంచికల్ పేట మెయిన్ రోడ్డు నుంచి హనుమాన్ గుడి వరకు సిమెంట్ రోడ్డు వేయడానికి రూ. 20 లక్షలు మంజూరు కావడం జరిగింది. అయితే పాలకులు, అధికారులు ఒకటై ఇక్కడ వేయాల్సిన సిమెంట్ రోడ్డును నిబంధనలకు విరుద్ధంగా పెద్దంపేట ఆర్ అండ్ ఆర్ కాలనీలో వేయడం జరిగింది. పెంచికల్ పేట మెయిన్ రోడ్డు నుండి హనుమాన్ గుడి వద్దకు మంజూరైన సిమెంట్ రోడ్డును ఇక్కడే వేయాలని గ్రామస్తులు హనుమాన్ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నిధులు ఓ చోట మంజూరు అయితే మరోచోట సిమెంట్ రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా వేయడంపై పంచాయతీరాజ్ శాఖ మంథని డిఈ జనార్ధన్ ను వివరణ కోరగా… నిధుల మంజూరు ఇన్ ద విలేజ్ అని సాంక్షన్ వస్తే ఆ గ్రామంలో ఎక్కడైనా వేసుకోవచ్చు అని, అలా కాకుండా ప్రత్యేకంగా ఒక చోట నుంచి మరోచోటకి మంజూరు వస్తే మంజూరైన చోట మాత్రమే వేయాలని “జనంసాక్షి” కి తెలిపారు. మంజూరైన చోట కాకుండా వేరే చోట సిమెంట్ రోడ్డు పనులు చేపడితే అది నిబంధనలకు విరుద్ధమని, ఆ పనిని రిజెక్ట్ చేస్తామని పిఆర్ డిఈ సందర్భంగా స్పష్టం చేశారు.