సుల్తానాబాద్‌ అభివృద్దికి కృషి

ప్రాథమిక సౌకర్యాలపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే
పెద్దపల్లి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): పురపాలక సంఘంగా ఏర్పడ్డ సుల్తానాబాద్‌ పట్టణాభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని అని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. కొత్త మున్సిపాలిటీ అన్నింటా పోటీ పడి ముందుకు సాగేలా అధికారులు చొరవ చూపాలని అన్నారు. ఇందుకోసం పక్కాగా ప్లాన్‌ చేయాలని
అధికారులను ఆదేశించారు.  పట్టణంలో భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేలా రోడ్ల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ కార్యక్రమాన్ని వారంలోగా చేపట్టాలని సూచించారు. గతంలో రూర్బన్‌ పథకంతోపాటు, పెండింగ్‌ వర్కులపై చేసిన తీర్మాణాలను రద్దు చేసి నూతనంగా చేపట్టాలనీ, కాల్వ శ్రీ రాంపూర్‌ రోడ్డు, పూసాల రోడ్డు, చెరువు వద్ద నుంచి ఎంపీడీఓ కార్యాలయం దాకా రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలన్నారు. రోడ్డుకు అడ్డంగా మధ్యలో ఉన్న కరెంట్‌ స్తంభాలను తొలగించేందుకు విద్యుత్‌ అధికారులకు సహయం తీసుకోవాలని సూచించారు. రూర్బన్‌ పథకంలో ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నాయని నిధులున్న పనులు చేయించడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. అధికారులను పనిచేయించే భాద్యత స్థానిక నేతలు తీసుకోవాలని సూచించారు. అధికారుల పనీతీరుపై ఆసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు. బా ధ్యతయుతంగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ ఏర్పడి  ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని వివరించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్రం వృద్ధిలోకి వెళ్తుందనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా మురికి కాలువలు ఉండకుండా ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలనీ, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సహకరించాలని కోరారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా గ్రామాల్లో అంతర్గత రహదారులన్నీ 24 ఫీట్ల పైబడి ఉండేలా చూసుకోవాలని వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన వారంతా ఆయా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సాధ్యమైనంత మేరకు అంతర్గత రహదారులను వెడల్పు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను చేపడుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.