సువాసన లేని ‘గులాబీ’ వనం

ఎవరైనా కదిలిస్తే చాలు. తమది ఉద్యమ పార్టీ అని, కేవలం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే తమ పార్టీ ఆవిర్భావం జరిగిందని చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, మళ్లీ ఉద్యమ స్ఫూర్తిని కనమర్చడంలో విఫలమయ్యారు. రాష్ట్రపతి ఎన్నిక ప్రకటన వెలువడి, పూర్తయ్యే దాకా కూడా ఎన్నికలో పాల్గొంటారో, పాల్గొనరో వెల్లడించారు. మిగిలిన పార్టీల్లాగే ఎవరో ఒకరికి ఏవో కారణాలు చెప్పి ఓటేస్తారని అందరూ భావించారు. మిగతా నాయకుల్లాగే జేఏసీ సూచనను విస్మరిస్తారుకున్నారు. ఈ అనుమాలు వెల్లువెత్తడానికి కూడా కారణాలు లేకపోలేదు. కొన్ని రోజుల కిందట జేఏసీ మలిదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన రెండు రోజులకే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‘త్వరలో తెలంగాణ’ అన్న ప్రకటన చేశారు. దీంతో విస్తుపోవడం తెలంగాణవాదుల వంతయింది. జేఏసీ ఉద్యమ సన్నాహాలు చేస్తుంటే, కేసీఆర్‌ ఇలా ప్రకటనలు చేయడమేమిటన్న చర్చ మొదలైంది. జేఏసీకి, టీఆర్‌ఎస్‌కు ఎడం పెరుగుతున్నదన్న ఊహాగానాలు చెలరేగాయి. అందుకే, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక సమయంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠతను పటాపంచలు చేస్తూ టీఆర్‌ఎస్‌ రాష్ట్రపతి ఎన్నికకు ఓటెయ్యలేదు. ప్రణబ్‌ తెలంగాణ అంశాన్ని నాన్చడంలో ప్రధాన పాత్ర పోషించారని, కాంగ్రెస్‌ తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదని, అందుకే రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించామని, ఎన్నిక జరిగే రోజూ ప్రకటించారు. దీంతో సొంత ప్రయోజనాల కోసం ఓటేస్తుందేమోననుకున్న వారి అనుమానాలు తీరిపోయాయి. టీఆర్‌ఎస్‌ తెలంగాణవాదాన్ని మళ్లీ బలపర్చిందని తెలంగాణవాదులు హర్షించారు. కానీ, టీఆర్‌ఎస్‌ తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా, తీసుకున్న విధానమే బాగా లేదని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ప్రధాని ఫోన్‌ చేసి ప్రణబ్‌కు ఓటెయ్యమని తనను కోరిన విషయాన్ని వెల్లడించి, పార్టీ తీసుకోబోయే నిర్ణయాన్ని ముందుగా ప్రకటించక పోవడం తెలంగాణవాదులను నిరాశపర్చింది. దీంతో ఎప్పుడూ అవకాశం వచ్చిన గుప్పుమని సువాసనలు వెదజల్లే గులాబీ, ఈసారి ఆ స్థాయిలో తన సామర్థ్యం చూపలేదన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి రాష్ట్రపతి ఎన్నికకు ముందు కేసీఆర్‌ పొలిట్‌ బ్యూరో సమావేశం పెట్టి, 56 పార్టీలు ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుగా ఆమోదం తెలిపినా ప్రణబ్‌ తెలంగాణపై నివేదిక ఇవ్వలేదని, డిసెంబర్‌ 9న తెలంగాణ అనుకూల ప్రకటన వెలువడ్డాక, మళ్లీ వెనక్కి తీసుకుంటున్నట్లు తెల్లారి ప్రకటించిన విషయం తనకు తెలియదని ప్రణబ్‌ బుకాయించాడని, పార్లమెంట్‌ సమావేశాల్లో నిరసన తెలుపుతున్న ఎంపీలను తన చాంబర్‌లోకి పిలిపించుకుని, నిరసన తెలిపితే వచ్చే ఎన్నికల్లో సీట్లివ్వమని బెదిరించాడని, ఇలా ప్రణబ్‌ చేసిన పలు తెలంగాణ వ్యతిరేక పనులను వివరిస్తూ, అందుకే తాము ప్రణబ్‌కు ఓటెయ్యకుండా రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు పార్టీ మాటగా కేసీఆర్‌ ప్రకటించి ఉంటే బాగుండేది. ఇలా చేస్తే కాంగ్రెస్‌కు కూడా ఓ ఝలక్‌ ఇచ్చినట్లుండేది. అప్పుడైనా సోనియా గాంధీ మరోసారి ఆలోచనలో పడేది కావచ్చు. కానీ, టీఆర్‌ఎస్‌ వ్యవహరించిన తీరు నిజంగా తెలంగాణవాదులకు బాధాకరం. ఏదేమైనా ప్రజలు టీఆర్‌ఎస్‌ తీసుకున్న తప్పక స్వాగతిస్తారు. అభినందిస్తారు. టీడీపీ లాగా ‘రెండు కళ్ల’ ప్రకటన చేయక, కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసమే రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించినట్లు ఆలస్యంగానైనా ప్రకటించినందుకు అభినందిస్తారు.