సైకో జాడ కోసం నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వేట!

ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులపై ఆరా..
నెల్లూరు, జూలై 29: సైకో కోసం నాలుగు రాష్ట్రాల్లో వేట.. గురువారంనాడు భద్రాచలం-చెన్నయ్‌ బస్సులో ముగ్గురు ప్రయాణీకులను కిరాతకంగా హత్య చేసి మరో ప్రయాణికుడి ప్రాణాపాయ స్థితికి కారణమైన సైకోను పట్టుకునేందుకు తాజాగా పోలీసులు చతుర్ముఖ వ్యూహాన్ని అమలుపరుస్తున్నారు. ఇందులో భాగంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా రాష్ట్రాల్లో అక్కడి పోలీసులతో ఎపి పోలీసులు కలిసి వేటను తీవ్రతరం చేశారు. రాత్రి బాగా పొద్దుపోయాక గుంటూరు రేంజి ఐజి హరీష్‌కుమార్‌ గుప్తా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ పథకం అమలు చేస్తున్నారు. గత రాత్రి 10 గంటల ప్రాంతంలో నాలుగు రాష్ట్రాలకు పోలీసు బృందాలు తరలి వెళ్లగా నెల్లూరు జిల్లాలో 200 మంది పోలీసులతో కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు పోలీసుల పరిశోధనలో పెద్దగా ఫలితాలు కనిపించకపోవడంతో దీన్ని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్న గుంటూరు రేంజి ఐజి హరీష్‌కుమార్‌ నిందితుడ్ని పట్టుకునేంతవరకు జిల్లాలోనే ఉండాలని కోరారు. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కాళహస్తి ప్రాంతంలో ఓ మరాఠి యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు గంటసేపు ఇంటరాగేషన్‌ చేసి అటు తర్వాత వదిలిపెట్టారు. జిల్లా ఎస్‌పి బీవీ రమణకుమార్‌, చిత్తూరు జిల్లా ఎస్‌పి కాంతిలాల్‌ రాణా నేతృత్వంలో నేరుగా ఎస్‌పిలే పరిశోధనలోకి దిగడం చెప్పుకోదగ్గ విశేషం. ఇందులోభాగంగా చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం గ్రామంలో గల కల్కి భగవాన్‌ ఆశ్రమంలో 2007లో జరిగిన సీరియల్‌ హత్య కేసుల్లో నిందితులైన పలువుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆ వ్యక్తులకు గురువారం నాడు జరిగిన హత్యలకు సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో కాంతిలాల్‌ రాణా స్వయంగా కల్కి భగవాన్‌ ఆశ్రమానికి వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఇదిలా ఉండగా భద్రాచలంలో శుక్రవారంనాడు అదుపులోకి తీసుకున్న శ్రీను అనే వ్యక్తిని ప్రశ్నించి వదిలివేసినప్పటికీ పోలీసులు మళ్లీ ఒక ప్రత్యేక పార్టీని భద్రాచలానికి పంపడంతో ఆ దిశగానే ఎక్కువగా దృష్టి కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున నాలుగున్నర, అయిదు గంటల ప్రాంతంలో హంతకుడు ముగ్గుర్ని హత్య చేసినట్టు ప్రాధమిక నివేదికలో వెల్లడి కాగా హంతకుడ్ని చూచాయగా గుర్తు పట్టగలిగే రమేష్‌ను తిరిగి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ హత్యోదంతంలో ప్రకాశం జిల్లా ఉలవపాడు ప్రాంతానికి చెందిన రమేష్‌ అనే ఉద్యోగి సైకో కేసులో తృటిలో తప్పించుకుని చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్‌ ఎవరికీ చెప్పకుండా శుక్రవారం రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిపోయారు. ఉలవపాడులోని తన స్వగ్రామంలో ఉన్న రమేష్‌ను శనివారం రాత్రి పోలీసులు నెల్లూరుకు తీసుకువచ్చినట్టు తెలిసింది. అతడు చెప్పే ఆధారాల ప్రకారం అగంతకుడి ఊహా చిత్రాన్ని తయారు చేయాలనేది పోలీసుల భావన. అయితే రమేష్‌ ఇంకా మాట్లాడలేని స్థితిలో ఉన్నందువల్ల కొంత సమయం వృధా అవుతోందనని జిల్లా ఎస్‌పి బీవీ రమణకుమార్‌ తెలిపారు. అలాగే బస్సులో మొత్తం 24 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో కాకినాడ, రాజమండ్రి ప్రాంతానికి చెందిన ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఉన్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు వారిని సంప్రదించేందుకు ఆ ప్రాంతాలకు పోలీసులు బయల్దేరి వెళ్లారు. ఇక తమిళనాడులోని చెంగల్పట్టు, తంజావూరు, రాయవేలూరు ప్రాంతాలకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక పోలీసు బలగాలను పంపింది. అదే సమయంలో నెల్లూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన ఆరంబాకంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిందితుడు మత్స్యకారుల గ్రామాల్లో తలదాచుకుని ఉండొచ్చన్న అనుమానంతో సముద్ర తీర ప్రాంతంలో మెరైన్‌ పోలీసుల సహకారంతో గ్రామాలను జల్లెడ పడుతున్నారు. వ్యక్తిగత కక్షల వల్ల ఈ హత్యలు జరిగి ఉండకపోవచ్చని భావిస్తుండగా హత్యకు కారణాలు ఇంకా వెల్లడి కాలేదని చెబుతున్న పోలీసులు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులను సైతం సంప్రదించినట్టు తెలుస్తోంది. హత్య సమయంలో ఆగంతకుడు వాడిన ఆయుధం సర్జికల్‌ బ్లేడుగా గుర్తించడం వల్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.