సైనిక తిరుగుబాటును సమర్థించుకున్న మయన్మార్ సైన్యాధిపతి
నేపిడా,ఫిబ్రవరి 3(జనంసాక్షి):మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యాధిపతి మిన్ ఆంగ్ లయాంగ్ తొలిసారి స్పందించారు. ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు తప్పలేదని చెప్పుకొచ్చారు. అలాగే ఈ అనూహ్య నిర్ణయానికి దారితీసిన కారణాలను వివరించారు. ఎన్నికల నిర్వహణపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించలేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోమవారం జరిగిన తొలి కేబినెట్ భేటీలో ఆయన మాట్లాడినట్లు మిలిటరీ అధికార ఫేస్బుక్ ఖాతాలో వెల్లడించారు.”ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించలేదు. దీనిపై వివరణ ఇవ్వాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరాం. కానీ, ప్రభుత్వం విఫలమైంది. అందుకే పాలనను సైన్యం చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. ఇది చట్టం ప్రకారమే జరిగింది” అని లయాంగ్ వివరించినట్లు ఫేస్బుక్ ఖాతాలో రాసుకొచ్చారు. మరోవైపు సైనిక చర్యను ఖండిస్తూ దేశ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఉండడంతో చాలా మంది ఇంట్లోనే ఉండి వివిధ రకాల శబ్దాలు చేస్తూ నిరసన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆంగ్ సాన్ సూకీ సహా తమ నేతలందరినీ విడుదల చేయాలని కోరుతూ ఎన్ఎల్డీ పార్టీ యంగోన్ నగరంలో అక్కడక్కడ ఆందోళన చేపట్టింది. సైనిక తిరుగుబాటు తర్వాత ఆ దేశ ప్రముఖ నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ సహా 400 మంది ఎంపీలు నిర్బంధంలోనే ఉన్నారు. మరోవైపు ఉపాధ్యక్షుడు మయింట్ స్వెని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించిన సైన్యం ఆ వెంటనే లయాంగ్‌కు సర్వాధికారాలను బదలాయించుకొంది. అత్యయిక పరిస్థితి ఉన్నప్పుడు ఇలా చేయడానికి ఆ దేశ రాజ్యాంగం అనమతిస్తుంది. అనంతరం లయాంగ్ 11 మందితో నూతన కేబినెట్‌ను ఏర్పాటు చేసి వారితో భేటీ అయ్యారు.