సొంత పట్టణంలో ముర్రేకు ఘనస్వాగతం

డన్‌బ్లేన్‌ (స్కాట్లాండ్‌) ,సెప్టెంబర్‌ 17 :ప్రపంచ టెన్నిస్‌లో బ్రిటీష్‌కు గ్రాండ్‌శ్లామ్‌ కరవు తీర్చిన ఆండీముర్రే స్వదేశంలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. వరుసగా లండన్‌ ఒలింపిక్స్‌ , యుఎస్‌ ఓపెన్‌లో చారిత్రక విజయాలు సాధించిన ముర్రేకు సొంత పట్టణం డన్‌బ్లేన్‌ ఘనస్వాగతం లభించింది. స్కాట్లాండ్‌లోని పట్టణమైన డన్‌బ్లేన్‌లోనే ముర్రే జన్మించాడు. లండన్‌ ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచిన తర్వాత బిజీ షెడ్యూల్‌ కారణంగా ఈ బ్రిటన్‌ సెన్సేషన్‌ ఇక్కడకి రాలేకపోయాడు. అయితే యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో జొకోవిచ్‌పై విజయంతో కెరీర్‌లో తొలి గ్రాండ్‌శ్లామ్‌ తన ఖాతాలో వేసుకున్న ముర్రే తొలిసారిగా తన ¬మ్‌టౌన్‌కు తిరిగొచ్చాడు. ఎయిర్‌పోర్టులో వేలాదిమంది అభిమానులు ముర్రేకు గ్రాండ్‌వెల్‌కమ్‌ చెప్పారు. అనంతరం ఓపెన్‌టాప్‌ బస్‌లో ఊరేగింపుగా ముందుకు కదిలాడు. ముర్రేను విష్‌ చేస్తూ రోడ్డుకిరువైపులా అభిమానులు స్కాట్లాండ్‌ జెండాలతో సందడి చేశారు. తర్వాత అతనితో కరచాలనం చేసేందుకు , ఆటోగ్రాఫులు , ఫోటోల కోసం ఎగబడ్డారు. అందిరతోనూ ఎంతో సహనంగా మాట్లాడిన ముర్రే అభిమానులతో చాలాసేపు ముచ్చటించాడు. తనకు మధ్ధతుస్తోన్న ఇంతమంది అభిమానులందరికీ ముర్రే కృతజ్ఞతలు చెప్పాడు. ఈ స్వాగతాన్ని ఎప్పటకీ మరిచిపోలేనని వ్యాఖ్యానించాడు. నిజానికి ఆండీ ముర్రే గత వారమే ఇక్కడకి రావాల్సి ఉంది. అయితే తీరిక లేని షెడ్యూల్‌తో అలసిపోయిన ఈ బ్రిటన్‌ ప్లేయర్‌ లండన్‌లోనే విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో రెండురోజుల క్రితం ఇక్కడ జరిగిన ఒలింపియన్ల పెరేడ్‌కు హాజరు కాలేకపోయాడు.¬మ్‌టౌన్‌కు వచ్చిన తర్వాత ముర్రే అభిమానులతో ఉల్లాసంగా గడిపాడు.లోకల్‌ టెన్నిస్‌ క్లబ్బులను సందర్శించి అక్కడి చిన్నారులతో టెన్నిస్‌ ఆడాడు. వారికి ఆటలో మెళుకవలు నేర్పించాడు.