సోంపేట కాల్పుల ఘటనపై చర్యల నివేదిక సమర్పించండి: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: సోంపేట కాల్పుల ఘటనపై న్యాయవిచారణకు సంబంధించి చర్యల నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం అభిప్రాయాన్ని కూడా వెల్లడించాలంటూ అడ్వకేట్‌ జనరల్‌కు సూచించింది. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై జరిపిన కాల్పుల ఘటనను సీబీఐ చేత దర్యాప్తు చేయించాలంటూ దాఖలన పిటిషన్‌లో విచారణ చేపట్టిన కోర్టు గతంలో న్యాయవిచారణకు ఆదేశించింది. ప్రస్తుతం న్యాయవిచారణ పూర్తె నివేదికను ప్రభుత్వానికి సమర్పించినందున ఆ నివేదికకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నా దానిపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ పినాకి చంద్రఘోష్‌, జస్టిన్‌ విలాన్‌ వి. అఫ్జల్‌ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ఈకేసులో శ్రీకాకుళం జిల్లా  ఎస్పీ, కలెక్టర్లతో పాటు డీజీపీ, రాష్ట్రప్రభుత్వం, సీబీఐ, నాగార్జునాకన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తుల ప్రోద్బలంతోనే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన స్థానికులపై కాల్పులు జరిగాయని పిటిషనర్‌ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన  కోర్టు న్యాయ విచారణపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది.