స్వయం సహాయక సంఘాలకు రూ.597కోట్లు

ఏలూరు, జూన్‌ 27 : పశ్చిమగోదావరి జిల్లాలో 2 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.597 కోట్లను రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు మంత్రి వట్టి వసంతకుమార్‌ తెలిపారు. భీమడోలు మండలం ఎంఎంపురంలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంత్రి మాట్లాడారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుతీరును సమీక్షించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ నిర్ణయం వల్ల లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించి వారి ఆర్థిక ప్రగతికి పాటుపడుతామని మంత్రి చెప్పారు. జిల్లాలో 2012-13 ఆర్థిక సంవత్సరంలో 21 వేల 603 స్వయం సహాయక సంఘాలకు 597 కోట్ల రూపాయల మేర వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇప్పటికే 1400 సంఘాలకు 38 కోట్ల రూపాయల మేర రుణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. వచ్చే మార్చిలోగా జిల్లాలో రెండు లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరేలా వడ్డీ లేని రుణాలను అందించి మహిళలకు చేయూతనిస్తామని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను కోరారు. గతేడాది జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు 472 కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా నిర్ణయించగా 447 కోట్ల రూపాయలు మాత్రమే మహిళలకు రుణాలివ్వడం జరిగిందన్నారు. డిసెంబరు నాటికే మహిళలకు రుణాలిచ్చేలా శ్రద్ధ వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పిడి వై.రామకృష్ణను ఆదేశించారు. గతంలో పావలా వడ్డీ పథకం కింద 33.85 కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు చెల్లించామని, మరో 14.39 కోట్ల రూపాయల సొమ్మును ఆయా మహిళా సంఘాల ఖాతాలకు త్వరలో జమ చేయడం కూడా జరుగుతుందని చెప్పారు. జిల్లాలో కౌలు రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా పెద్ద ఎత్తున రుణాలను అందించేందుకు ఇప్పటికే తగు ఆదేశాలు ఇచ్చామన్నారు. గతేడాది జిల్లాలో 80వేల మంది కౌలు రైతులకు 81 కోట్ల రూపాయల మేర పంట రుణాలు అందించగా ఈ ఏడాది 200 కోట్ల రూపాయలకు పైగా రుణాలను కౌలు రైతులకు అందించి వారి వ్యవసాయ అవసరాలను తీర్చడం జరుగుతుందని ఆయన చెప్పారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి 7 గంటల పాటు కరెంటు అందించేలా ట్రాన్స్‌కో అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని మంత్రి ట్రాన్స్‌కో ఎస్‌ఇని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే మైనస్‌ 12శాతం వర్షపాతం నమోదు అయిన దృష్ట్యా నారుమళ్లు దెబ్బ తినకుండా బోర్లు ద్వారా వాటిని రక్షించుకోడానికి కరెంటు కోత లేకుండా చూడాలని ఆయన చెప్పారు. జిల్లాలో భూ పంపిణీ కార్యక్రమం కింద పేదలకు వ్యవసాయ భూములను అందజేయడానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని నిరుపయోగమైన భూములు సేద్యానికి పనికివచ్చేలా తీర్చిదిద్దిన తర్వాతే పేదలకు అందిస్తే దానివల్ల వారి జీవితాలు బాగుపడతాయని మంత్రి చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా జిల్లాలో రైతుకు అండగా నిలబడతామని ప్రతీ రైతుకూ లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని వసంతకుమార్‌ చెప్పారు. జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని మరింత వేగవంతం చేసి పేదలకు శాశ్వత గృహ సౌకర్యాన్ని కల్పిస్తామని జిల్లాలో ఏ గ్రామంలోనైనా పేదలకు ఇళ్ల స్థలాలు కావాలంటే అవసరమైన భూమిని సేకరించి అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత మూడేళ్లతో పోలిస్తే ఇటీవల కాలంలో సంక్షేమ పథకాలు లబ్దిపొందే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, పేదల ఆర్థిక పురోభివృద్ధే ప్రభుత్వ ధ్యేయంగా అధికారులు మరింత సమర్ధ వంతంగా పనిచేయాలని కోరారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజనకలో విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని, ఎక్కడైనా అక్రమ నిల్వలు ఉంటే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే, అటువంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.మోహనరాజు, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ వై.రామకృష్ణ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆర్‌వివి సత్యనారాయణ, ట్రాన్స్‌కో ఎస్‌ఇ సూర్యప్రకాశరావు, ఏలూరు ఆర్డీవో కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.