హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే సర్వత్రా ఆసక్తి !
తెలుగు రాష్టాల్ల్రో జరుగుతున్న రెండు ఉప ఎన్నికల్లో ..ఇప్పుడు అందరి కళ్లూ హుజూరాబాద్ వైపే ఉన్నాయి. బద్వేల్ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి పోటీలో లేకపోవడం, అక్కడ వైసిపికి కాంగ్రెస్, బిజెపిలు పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడం, దివంగత ఎమ్మెల్యే సతీమణి దాసరి సుధ అక్కడ పోటీలో ఉండడంతో ఆమె గెలుపు ఖాయమన్న భావన ఏర్పడిరది. అక్కడ వైసిపి తన బలాన్ని పెంచుకుని మెజార్టీ చూపాలన్న ఆకాంక్షతో పనిచేస్తోంది. కాబట్టి బద్వేల్ ఉప ఎన్నికపై పెద్దగా ఆసక్తి కానరావడం లేదు. వైసిపిని వ్యతిరేకించే వారు సైతం పెద్దగా అక్కడ ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతను చూపడం లేదు. దీనిని బట్టి అక్కడ వార్ వనసైడ్ అని తేలిపోయింది. అయితే హుజూరాబాద్ అలాకాదు. అక్కడ తెలంగాణ ఉద్యమనేతల్లో కీలకంగా ఉండి, మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ నుంచి బయటపడి బిజెపిలో చేరి పోటీ చేస్తున్నందున సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. అందుకే అక్కడ గతంలో ఏ ఎన్నికలో చెయ్యనంత ప్రచారం చేశారు. ఏ ఎన్నికల్లో చెయ్యనంత ఖర్చు చేశారు. ఎన్నడూ లేని విధంగగా హుజూరాబాద్ కోసం సిఎం కెసిఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టి 70వేల దళిత ఓట్లకు గాలం వేశారు. అలాగే వివిధ పథకాల కింద ఇంకా అనేకమొత్తం ఖర్చుచేశారు. కెసిఆర్ కూడా ఎలాగైన హుజూరాబాద్ టిఆర్ఎస్దని అనిపించడానికి శతవిధాలా కష్టపడ్డారు. ఇంతకాలం టిఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ ఇప్పుడు టిఆర్ఎస్దా లేక ఈటెలదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇక్కడ టిఆర్ఎస్ గెలిస్తే అది టిఆర్ఎస్ కంచుకోట అనడానికి, కెసిఆర్ చాణక్యం అనడానికి వీలు కలుగుతుంది. ఒకవేళ ఈటెల రాజేందర్ గెలిస్తే ఆయన పులిబిడ్డగా నిలబడతాడు. నిఖార్సయిన తెలంగాణ ఉద్యమబిడ్డగా నిలుస్తాడు. అందుకే ఇది ఎవరిదని తేల్చడానికి ప్రజలు ఎవరివైపో తేలడానికి ఈ ఎన్నిక ఓ ఉదాహరణ కాబోతున్నది. ఎత్తులు.. సవాళ్లు..ప్రతి సవాళ్లు, విమర్శలు.. ప్రతి విమర్శలతో హోరెత్తించిన హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం అంతా టిఆర్ఎస్, బిజెపిల మధ్యనే జరిగింది. కాంగ్రెస్ ప్రచారం పెద్దగా లెక్కలోకి తీసుకునేంతగా లేదనే చెప్పాలి. గతంలో ఎప్పుడూ ఏ ఉప ఎన్నికకు జరగని విధంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేశాయి. అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు నుంచే ప్రచారాన్ని ప్రారంభించాయి. అలాగే బహుశా ఐదారు నెలల నుంచి ఇక్కడ జోరుగా ప్రచారం సాగింది. మంత్రులంతా ఇక్కడే మకాం వేసి ప్రచారంలో నిలిచారు. ప్లీనరీలో కూడా పాల్గొనకుండా హరీష్ రావులాంటి వారు ఇక్కడే తిష్టవేశారు. టిఆర్ఎస్ కూడా తమ ప్రత్యర్థి బిజెపి, ఈటెల అన్న విధంగా ముమ్మరంగా ప్రచారం చేసింది. అలాగే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు మాటలను తూటాల్లా పేల్చారు. ఎన్నికల ప్రచారం రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ప్రధానంగా ఈ ఉపఎన్నిక టిఆర్ఎస్, బిజెపి పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారగా, కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. ఈ నేపథ్యం లో మూడు పార్టీలు గెలుపు కోసం శాయశక్తులా ప్రచారం చేశాయి. దీంతో ఉపఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందన్న అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా గెలుపు కోసం బిజెపి, టిఆర్ఎస్ పార్టీల మధ్య సాగిన ప్రచారం జాతీయస్థాయిలో కూడా చర్చగా మారింది. ఇది కెసిఆర్ వ్యూహానికి, ప్రతిష్టకు సవాల్‌గా మారింది. దీని కారణంగానే రెండు పార్టీలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసం నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారంలో తమ వాగ్ధాటిని ప్రదర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా ఇక్కడ ఈటెల గెలుస్తూ వచ్చారు. టిఆర్ఎస్ ఆవిర్భావం తరువాత హుజూరాబాద్ అసెంబ్లీ
నియోజకవర్గం మొదటి నుంచి ఆ పార్టీకి కంచుకోటగా నిలుస్తోంది. ఆరుసార్లు ఈ నియోజకవర్గంపై గులాబీ జెండా రెపరెపలాడిరది. ఇదంతా ఈటెల రాజేందర్‌కు ఉన్న వ్యక్తిగత ప్రతిభ లేదా ప్రజల్లో ఉన్న ఆదరణ గానే చూడాలి. ఇప్పుడు ఈటెల టిఆర్ఎస్ను వీడారు కనుక హుజూరాబాద్ ఎవరిదన్న ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. అందుకే కూడా ఇక్కడి నుంచి విజయం సాధించి హుజూరాబాద్‌లో తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు టిఆర్ఎస్ శ్రేణులు నానా తంటాలు పడ్డారు. టిఆర్ఎస్లో ఉంటూ ఉద్యమనేతగా, ఆ తరవాత రాజకీయంగా ఉన్నతస్థితికి ఎదిగిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ª`లో గట్టి నేతగా పాతుకుని పోయారు. ఎలాగైనా ఈటలను ఓడిరచి మరోసారి టిఆర్ఎస్ సత్తా చాటాలన్న పట్టుదలతో పార్టీ యంత్రాంగ మంతా అక్కడే మకాం వేసి ఎన్నికల ప్రచారం చేసింది. ఈ ఎన్నిక పుణ్యమా అని ఈటెల కెసిఆర్ అహం కారంపై యుద్దం అంటూ బయలుదేరారు. ఈటెలను ఓడిరచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటి నుంచి ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ప్రతిష్టాత్మకంగా మారింది. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు శాసనసభ్యులు, పార్టీ నేతలు నెలలుగా నియోజక వర్గంలోనే మకాం వేసి టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించే బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. అలాగే మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఇతర మంత్రులు,ఎంపిలు కూడా అడపాదడపా ప్రచారంలో పాల్గొన్నారు. ఇకపోతే ప్రచారంలో పెట్రో దరలు, రైతుల సమస్యలు, గ్యాస్ ధరలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ పెంచుతున్న పెట్రోలియం ఉత్పత్తులతో పాటు గ్యాస్‌బండ ధరలను ప్రధానంగా చేసుకుని మంత్రులు బిజెపిని తూర్పారబట్టారు. అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపైనా విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధానంగా దళితబంధు కింద ఆయా వర్గాలకు ప్రతి కుటుంబానికి పదిలక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందకుండా చేశారని విమర్శలు చేశారు. అలాగే ఈ గెలుపును ఈటలతో పాటు బిజెపి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయన్న భావన రాష్ట్ర ప్రజల్లో కల్పించాలన్న దిశగా ముమ్మరంగా ప్రచారం చేసింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా ఈటెల తన పట్టును నిరూపించుకుంటారా లేక టిఆర్ఎస్ కంచుకోట అని కెసిఆర్ నిరూపిస్తారా అన్న ఉత్కంఠ మాత్రం ప్రజల్లో నెలకొంది.