పొగమంచులో ప్రయాణాలు చేయొద్దు  భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):ప్రస్తుత వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల పొగమంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ప్రయాణీకులు సురక్షితమైన ప్రయాణాలు మాత్రమే చేయారని తెలిపారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులను గమనించే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుందని, అల్ప నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో వాహనాలను వేగంగా నడపకూడదని, శ్రద్ధగా, నిదానంగా ప్రయాణించాలని, తక్కువ దూరం మాత్రమే కనిపించే పరిస్థితుల్లో హెడ్‌లైట్లను లో బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లను తప్పనిసరిగా ఉపయోగించాలి అని సూచించారు. అత్యవసరంగా ప్రయాణం తప్పనిసరి అయినపుడు బ్రేకులు, లైట్లు, టైర్లు వంటి వాహన భాగాలను తప్పకుండా ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, అకస్మాత్ ఓవర్‌టేక్‌లు, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు వంటి ప్రమాదకర చర్యలు పూర్తిగా నివారించాలని హెచ్చరించారు.
పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించడం ద్వారా వాహనదారులు గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోగలుగుతారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే హితవు పలికారు.