హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించండి

ఆసుపత్రులకు రోగమొచ్చింది : ఈటెల
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) :
విషజ్వరాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారంనాడు పార్టీ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, జోగు రామన్న తదితరులతో కలిసి నిలోఫర్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని పరిస్థితులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం, సౌకర్యాలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ పరిస్థితులపై వైద్యులతో సంప్రదించారు. డెంగీ వ్యాధితో బాధప డుతున్న చిన్నారులను పరామర్శించారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఈటెల విలేకరులతో మాట్లాడారు. నిలోఫర్‌ ఆసుపత్రిలో పరిస్థితులు ఆధ్వానంగా ఉన్నాయని ఆరోపించారు. ఒక ఈ ఆసుపత్రిలోనే కాక, తెలంగాణ ప్రాంతంలోని అన్ని ఆసుపత్రుల్లోను పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. 500మందికి మాత్రమే చికిత్స అందించే వసతులు ఉన్న నిలోఫర్‌ ఆసుపత్రులలో దాదాపు 1400మందికి చికిత్సను అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో వెంటనే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆరోగ్యశ్రీ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. అసలు రాష్ట్ర ఆరోగ్య శాఖకే సుస్తీ చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విషజ్వరాలు వ్యాపించినా కనీసం జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో కూడా కనీస సౌకర్యాలు లేవని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మందులు కూడా అందుబాటులో లేవని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆసుపత్రుల్లో వసతులు అరకొరగా ఉన్నాయని ఈటెల ఆరోపించారు. జిల్లాల్లో ఆసుపత్రుల్లో మందులు, సూదులు లేక ఇక్కడికి పంపిస్తున్నారని, ఇక్కడా అదే పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలాల నుంచి నగరానికి పిల్లలను తీసుకొస్తుండగానే వారు ప్రాణాలు కోల్పోతున్నారని అందుకే మండల కేంద్రాల్లోనే వెద్య సదుపాయాలు కల్పించాలని, డెంగ్యూ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌చేశారు.