*అంతా నా ఇష్టం అంటున్న నారాయణపురం పంచాయతీ సెక్రటరీ రమేష్*
సమయపాలన పాటించని నారాయణపురం గ్రామ కార్యదర్శి…*
*ప్రజల అవసరాల కోసం ఎన్ని రోజులు తిరిగిననా అందుబాటులో ఉండని వైనం…*
*అస్తవ్యస్తంగా మారిన గ్రామపంచాయతీ ఆవరణం…*
*ఇదేమిటని ప్రశ్నించిన స్థానిక గిరిజన ప్రజలను బెదిరిస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తున్న కార్యదర్శి…*
బయ్యారం, జూన్ 17(జనంసాక్షి):మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపురం గ్రామ కార్యదర్శి రమేష్ గత మూడు నెలలుగా సమయపాలన పాటించడం లేదని కనీసం స్థానిక ప్రజల అవసరాల నిమిత్తం గ్రామ పంచాయతీకి వెళ్లినా కూడా అందుబాటులో ఉండటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత పంచాయతీ సెక్రటరీ చనిపోయిన తర్వాత పెండింగ్ లో ఉన్న బిల్లులకు సంబందించిన చెక్కుల మీద సర్పంచ్ సంతకాలు ఆలస్యమైనందుకు ఉద్రేకపరుడైన కార్యదర్శి చెక్కులని ఉపసర్పంచ్ ముందే విసిరేసారు.గత మూడు నెలల కాలంలో ప్రతిరోజు ఉదయం 8:30 నిముషాలకు వచ్చి తిరిగి 11 గంటలకే పంచాయతీ కార్యాలయం వదిలి వెళ్ళిపోతారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలో జనంసాక్షి స్థానిక ప్రజలను పూర్తి విషయాలు తెలుసునే ప్రయత్నం చేసింది.కాగా పల్లె ప్రగతి కార్యక్రమం నడుస్తున్నప్పటికీ ఒక్కపూట డ్యూటీ చేస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే ఎండిఓ ఆఫీసులో మీటింగు ఉన్నదన్న వంక చెప్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మారుమూల గ్రామం అయినందుకే అధికారుల పర్యవేక్షణ ఉండదనే దైర్యంతో ఇష్టరాజ్యంలా వ్యవహారిస్తున్నారని, ఉపసర్పంచ్, సర్పంచులను సైతం లెక్కచేయని తరుణంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలను భయబ్రాంతులకు గురించేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.3నెలలలో ఏ ఒక్కరోజు పూర్తి స్థాయిలో పనిదినంలో లేరని, కల్యాణలక్ష్మి అప్లికేషన్ గురించి వచ్చే ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండరని,100రోజుల ఉపాధి హామీ పథకం కు సంబందించిన డబ్బులను సైతం 10వారాలు పనిచేసిన వాళ్లకు కూడా ఇప్పించలేదని, గ్రామపంచాయతీ పరిధిలో కొత్తగా ఒక్క మొక్కను నాటించలేదని, పాత మొక్కల పోషణ లో కూడా నిర్లక్ష్యంగా ఉన్నారని గ్రామస్తులు తెలియజేశారు.కనీసం గ్రామపంచాయతి పరిధిలో వీధి లైట్లు, కరెంట్ పోల్స్ గురించి చెప్పినా “నాకు నచ్చినప్పుడు చేస్తాను” అని నిర్లక్ష్యం గా వ్యవహరిస్తారని, ఎప్పుడు చూసినా పంచాయతీ కార్యాలయం తాళం వేసి కనిపిస్తుందని, ఇలా ప్రజల మంచి చెడు పట్టించుకోని కార్యదర్శి ఉంటే ప్రజల సమస్యలు ఏలా తీరుతాయని ఆందోళన చెందారు.ప్రైమరి ప్రభుత్వ పాఠశాల పక్కనే గ్రామపంచాయతీ ఉండటం వలన దాని ఆవరణలో పెద్ద పెద్ద గుంతలు,కరెంటు వైర్లు వేలాడుతూ, బాత్రూంలో చెత్తాచెదారం ఉండడం వల్ల వర్షాలకు తేల్లు, పాములు చేరుతాయాని పిల్లల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.ఆఫీస్ ఆవరణ మొత్తం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందనీ, ఆఫీసునే శుభ్రం చేసుకోలేనివాడు గ్రామాన్ని ఎలా శుభ్రం చేయగలడని వారి బాధని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేసి నూతన కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.