అంబేడ్కర్ మహా ఆర్థికవేత్త
– ఆయన ఆలోచన విధానమే పరిష్కారం
– దళిత గిరిజన పారిశ్రామికవేత్తల సదస్సులో మోదీ
న్యూఢిల్లీ,డిసెంబర్29(జనంసాక్షి): భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ మహా ఆర్థిక వేత్త అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన దళిత, గిరిజన పారిశ్రామికవేత్తల జాతీయ సదస్సును మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దేశంలోని అనేకానేక ఆర్థిక సమస్యలకు అంబేడ్కర్ ఆలోచనలు పరిష్కారం చూపిస్తాయని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యాంగ రూపకర్తగానే అంబేడ్కర్ చాలామందికి తెలుసు. కానీ అంబేడ్కర్ గొప్ప ఆర్థికవేత్త అనే విషయం కొందరికే తెలుసన్నారు. జనవరి 26న మనకర్తవ్యాల గురించి ఎందుకు మాట్లాడకూడదని మన్‌కీ బాత్‌లో ప్రస్తావించానని ప్రధాని గుర్తు చేశారు. సదస్సుకు 1200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యోగాల సృష్టికర్తలను తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నిరుపేదలను ఆర్థికంగా బలవంతులను చేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పారిశ్రామికీకరణతో దళితులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్న బీఆర్ అంబేడ్కర్ వ్యాఖ్యలు కరెక్ట్ అని చెప్పారు.దళిత బహుజనుల స్వావలంబన కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ‘ఉద్యోగాల సృష్టికర్తలను తయారు చేయాలనుకుంటున్నాం, ఉద్యోగాల కోసం ఎదురుచూసేవాళ్లను కాదు’ అని మోదీ అన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా 80 లక్షల మంది ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని వెల్లడించారు. వీరిలో ఎక్కువమంది దళితులు, గిరిజనులు, ఓబీసీలని తెలిపారు. ఇదిలావుంటే అంకుర సంస్థల ప్రోత్సాహనికి సంబంధించి జనవరి 16న ప్రధాన మంత్రి మోదీ విడుదల చేయనున్న పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికలో వివిధ అంశాలను సులభతరం చేయడంతో పాటు కొత్త వెంచర్లకు మినహాయింపులను చేర్చే అవకాశం కనిపిస్తోంది. దీని కోసం వచ్చే నెల 16న ప్రభుత్వ ఉన్నతాధికారులు, వెంచర్ ఫండ్లు, ఇంక్యుబేటర్లు సమావేశమై తమ ఆలోచనలను తెలియజేయనున్నారు. ప్రతిపాదిత ప్రణాళికను ఆ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీకి అందించనున్నారు. కార్యాచరణ ప్రణాళికలో అంకుర సంస్థల నిర్వచనంతో పాటు వాటికి అందించే ప్రోత్సాహక వివరాలు ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే వాటికే అధిక ప్రాధాన్యమ’ని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రోత్సాహకాలతో పాటు అంకుర సంస్థలు ఏర్పాటును సులభతరం చేసే చర్యలు ఉంటాయని తెలిపారు.చట్టాలకు లోబడి పనిచేసేలా ప్రత్యేక విభాగాన్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా కార్యక్రమం కోసం డిజిటల్ యాంప్లిఫికేషన్ అండ్ సోషల్ అనలిటిక్స్ ఏజెన్సీ నియమాకం కోసం డీఐపీపీ బిడ్లను సైతం దీని కోసం వెబ్ పోర్టల్‌తో పాటు ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. కార్యచరణ ప్రణాళిక రూపకల్పనకు ప్రధానిమంత్రి కార్యాలయం, డీఐపీపీ, టెలికమ్యూనికేషన్ల శాఖ, కేబినెట్ సచివాలయం, ఎలక్టాన్రిక్స్, ఐటీ శాఖ మధ్య ఎడతెగని సమావేశాలు జరుగుతున్నాయి. రుణాలు, పర్యవేక్షణ, సీడ్ క్యాపిటల్, కంపెనీలను విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలతో అనుసంధానం చేయడం, మార్కెటింగ్, మేథో సంపత్తి హక్కులకు సంబంధించి కన్సల్టెన్సీ, సులభమైన నియంత్రణ విధానం వంటి అంశాలపై జనవరి 16న సమావేశాలు జరగనున్నాయి.