అంబేద్కర్‌ మహనీయునికి అంతటా నివాళి

సమాజ సూరీడు..డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి ఘనంగా జరిగింది. ఆదివారంనాడు కుల రహిత సమాజం కోసం పిలుపునిస్తూ 5కె రన్‌ కొనసాగింది. నెక్లెస్‌రోడ్డుపై ఆదివారం ఉదయం ప్రారంభమైన  రన్‌ 5ను రాష్ట్ర మంత్రి గీతారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండ్రు మురళి, అసెంబ్లీ ఉప సభాపతి మల్లు భట్టివిక్రమార్క, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, తదితరులు పాల్గొన్నారు. నెక్లెస్‌ రోడ్డులో ప్రారంభమైన 5కె రన్‌ టాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వరకు కొనసాగింది. ఈ రన్‌లో పెద్ద ఎత్తున యువత పాల్గొంది. ఈ రన్‌ అందర్నీ ఆకట్టుకుంది.
టాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రి దానం నాగేందర్‌, తదితరులు  టాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహాం వద్దకు చేరుకున్నారు. పుష్పమాలలు వేసి నివాళులర్పించారు.
అదేవిధంగా వైఎస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కూడా నివాళులర్పిం చారు. అంబేద్కర్‌ సేవలను కొనియాడారు. ఆమెతో పాటు ఆ పార్టీ నేతలు కూన శ్రీశైలంగౌడ్‌, వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్‌ కోదండరాం, టిజివో సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ కూడా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా నగరంలోని అంబేద్కర్‌నగర్‌లో అంబేద్కర్‌ విగ్రహాన్ని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.తారకరామారావు ఆవిష్కరించారు. అంబేద్కర్‌ ఆశయాలను కొనియాడారు.
అంబేద్కర్‌ సేవలు అపూర్వం : చిరంజీవి
డాక్టర్‌ అంబేద్కర్‌ తనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమేనని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. టాంక్‌ బండ్‌ వద్ద ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను అమలు చేస్తే దళితులకు మరింత మేలు చేకూరుతుందని ఆకాంక్షించారు. నిమ్మ వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. సామాజిక న్యాయం కోసమే తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టానన్నారు. అది కాంగ్రెస్‌ పార్టీ వల్లే సాధ్యమవుతోందని అన్నారు. అంబేద్కర్‌ ఆశయాలు నిత్యం స్మరణీయ మన్నారు. ఆ రోజుల్లోనే అస్పృశ్యత నివారణకు ఆయన చేసిన కృషి అపారమన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించడమే అందుకు నిదర్శనమన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు చట్టబద్దత వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. వాటన్నింటిని సద్వినియోగం చేసుకుని మరింత ఎదగాలని ఆకాంక్షించారు.ఎస్‌సి,ఎస్‌టిలకు చెందిన కాలనీల్లోని కుటుం బాలు 50 యూనిట్ల వరకు వాడుకునే వారు కరెంటు బిల్లు చెల్లించనవసరం లేదని తెలిపారు. ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఈ విధంగా ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోందని చెప్పారు.
చిన్న రాష్ట్రాల వల్లే సామాజిక న్యాయం : కోదండరాం
చిన్న రాష్ట్రాల వల్లే సామాజిక న్యాయం చేకూరుతుందని, ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఆనాడే అంబేద్కర్‌ చెప్పారని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. టాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేయడం గొప్ప కాదని ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు.
దళితులపై దాష్టీకాలను ఆపాలి : కవిత
దళితులపై జరుగుతున్న దాష్టీకాలను రూపుమాపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత అన్నారు. టాంక్‌బండ్‌పై అంబేద్కర్‌విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టింపజేయాలని కోరుతున్నామన్నారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
పుస్తకాలను తేవాలి : శ్రీనివాసగౌడ్‌
అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. టాంక్‌బండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. అంబేద్కర్‌ రచించిన పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అవినీతి రహిత రాజకీయం రావాలి : జెపి
అవినీతి రహిత రాజకీయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లోక్‌సత్తా అధినేత, ఎమ్మెల్యే జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. టాంక్‌బండ్‌పై అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్‌ ఆశయాలు ఎంతో ఉన్నతమైనవన్నారు. ఆయన ఆశయాలను అనుసరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కుల వివక్షను రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని కొనియాడారు.
ఆశయ సాధనకు కృషి : విజయమ్మ
బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు వైఎస్‌ఆర్‌సిపి కృషి చేస్తుందని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు  వైఎస్‌ విజయమ్మ అన్నారు. తన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ సంక్షేమ పథకాలకు అంబేద్కర్‌ ఆశయాలే మార్గ దర్శకాలని చెప్పారు.