‘జనంసాక్షి’ కథనానికి సీఎంఓ స్పందన

రంగారెడ్డి జిల్లాలో ప్రజావాణిపై ఆరా

ఇబ్రహీంపట్నం మండల ప్రజావాణి సందర్శన

రంగారెడ్డి , అక్టోబర్ 5 (జనంసాక్షి): “వినతులు వింటారు.. పరిష్కరించరు.. ప్రజావాణి గోడు అధికారులకు వినిపించదా?” అనే శీర్షికన ‘జనంసాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ప్రత్యేక కథనానికి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎఓ) స్పందించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌తో పాటు వివిధ మండలాల్లో సోమవారం కొనసాగుతున్న ‘ప్రజావాణి’ కార్యక్రమాలపై సీఎంఓ ప్రత్యేకంగా దృష్టిసారించి ఆరా తీసింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం ఎంపీడీవో కార్యాలయంతో పాటు పలు మండలాల్లో ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజావాణి నిర్వహణ తీరుతెన్నులు, అధికారుల హాజరు శాతాన్ని పరిశీలించారు.

అధికారుల గైర్హాజరీ, ఆలస్యంపై మండిపాటు

ప్రజావాణికి సమయానికి రాకుండా ఆలస్యంగా వచ్చిన ఇబ్రహీంపట్నం అగ్రికల్చర్ (వ్యవసాయ) అధికారిపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, మున్సిపల్ శాఖ కమిషనర్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తూ మందలించారు. బాధ్యతా యుతంగా ఉండాల్సిన క్షేత్రస్థాయి అధికారులు సైతం విధులకు గైర్హాజరు కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదేం ప్రజావాణి నిర్వాహణ?

కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్న తీరును చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. “కంప్యూటర్ ఆపరేటర్ ఎక్కడ? కంప్యూటర్ ఏదీ?” అంటూ సిబ్బందిని నిలదీశారు. కనీస సదుపాయాలు, బాధ్యత లేకుండా జరుగుతున్న ఈ తంతుపై మండిపడ్డారు. ఇలా చేస్తే ఎలా సమస్యలు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసి పరిస్కరించాలి. కానీ ఇక్కడ కంప్యూటర్ లేదు, అపరేటర్ లేరు ఎందుకని నిలదీశారు.

రికార్డుల సేకరణ

గత సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఏయే అధికారులు హాజరయ్యారనే దానిపై ఆరా తీశారు. గత వారానికి సంబంధించిన మూమెంట్ రిజిస్టర్, నేటి ప్రజావాణికి హాజరైన అధికారుల వివరాలతో కూడిన రిజిస్టర్‌ను పరిశీలించి, వాటి ఫోటో కాపీలను తనిఖీ బృందం తమ వెంట తీసుకెళ్లారు. ‘జనంసాక్షి’ కథనంతో అప్రమత్తమైన సీఎంఓ అధికారులు చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీలు స్థానిక అధికారుల్లో గుబులు పుట్టించాయి.