తల్లి కిడ్నీ దానం చేసినా దక్కని ప్రాణం.. యువకుడి మృతి

కల్హేర్ ఆగస్టు 31(జనం సాక్షి ) సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.కల్హేర్ మండలం రాపర్తి గ్రామానికి చెందిన ఈర్ల సాయిలు అనే యువకుడు కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు.సాయిలు కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు. కుమారుడి ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతో ఆయన తల్లి తన కిడ్నీని దానం చేశారు. తల్లి చేసిన అవయవదానంతో కిడ్నీ మార్పిడి అనంతరం సాయిలు కొంతకాలం ఆరోగ్యంగా ఉన్నారు. అయితే విధి మరోలా నిర్ణయించినట్లు తిరిగి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో చికిత్స పొందుతూనే సాయిలు సోమవారం తుదిశ్వాస విడిచారు.కుమారుడి ప్రాణం కోసం తల్లి తన కిడ్నీని దానం చేసినప్పటికీ చివరకు అతడిని కాపాడుకోలేకపోవడం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. యువకుడి అకాల మరణంతో రాపర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కలచివేశాయి.



